అల్లు అర్జున్ vs రేవంత్ రెడ్డి
ఇంటలీజెన్స్ వైఫల్యం ఉందేమో అన్న ఏపీ నేత
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, మహా : సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. తొక్కిసలాట నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణలో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై పల్లా శ్రీనివాసరావు స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్న పల్లా బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే బెనిఫిట్ షోల రద్దుకు తాను వ్యతిరేకమని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
” పుష్ప 1 సినిమా హిట్ అయ్యింది. పుష్ప 2 సినిమా కూడా హిట్ అవుతుందనే ఆలోచన ఉంది. ప్రజలు అందరిలో ఈ ఆలోచన ఉంది. అలాంటి సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కావున. ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే సినిమా నటులు కూడా అలాంటి సమయాల్లో వెళ్లకపోవటమే మంచిది. ఎందుకంటే వారికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరో వస్తున్నారనగానే భారీగా తరలివస్తారు. అందుకే వెళ్లకూడదనే ఆలోచన చేస్తే బాగుంటుంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అయితే బెనిఫిట్ షోలు వద్దు అనే దానికి నేను వ్యతిరేకం. బెనిఫిట్ షో వేయాలి. ప్రస్తుతం పైరసీ ఎక్కువైంది. నాలుగు రోజుల్లోనే పైరసీ చేస్తున్నారు. బెనిఫిట్ షోలు వేయకపోవటం కరెక్ట్ కాదు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.” అంటూ పల్లా శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇంటలీజన్స్ వైఫల్యం ఉందేమో…
మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి సమయాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందుగానే అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా సినిమా నటుల మీద కూడా ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తాం
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌కు అనుకూలంగా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయన్న పల్లా శ్రీనివాసరావు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే స్వాగతిస్తామన్నారు. ఇదే విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని గుర్తు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే ఉపాధి పెరుగుతుందని, కళాకారులకు చేతి నిండా పనిదొరుకుతుందని పల్లా శ్రీనివాసరావు అన్నారు.