Mahaa Daily Exclusive

  ఐకాన్ స్టార్ ఐతే ఏంటి? సీఎంకు సారీ చెప్పాలి – మంత్రి కోమటిరెడ్డి ఫైర్

Share

హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీనటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు. శనివారం మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదం. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని మండిపడ్డారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోసారి స్పష్టంగా తెలిపారు. త్వరలో సినీ ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయి చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. మంచి సినిమాలు తీస్తే తప్పకుండా ప్రోత్సహిస్తాం, సినీరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుబట్టడం సరికాదని, అల్లు అర్జున్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తొక్కిసలాటపై అసెంబ్లీలో తన ఇమేజ్ దెబ్బతీశారని అల్లు అర్జున్ అంటున్నారు.. కానీ, సీఎం వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదని.. ఆరోజు జరిగిన ఘటనను పూర్తిగా వివరించి చెప్పారన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడని మంత్రి అన్నారు. పోలీసులు వద్దని చెప్పినా.. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. అల్లు అర్జున్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన వెళ్లి కనీసం బాధితులను పరామర్శించలేదని మండిపడ్డారు. అరెస్ట్ సమయంలో పోలీసులు ఎంతో సహనంతో వ్యవహరించారన్నారు. ఒక వ్యక్తి ప్రాణం పోవడం మామూలు విషయం కాదన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? చట్టం ముందు అందరూ సమానులేనని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవన్నారు. తప్పు చేస్తే నటుడికైనా.. ఎమ్మెల్యేకైనా శిక్ష తప్పదన్నారు.