Mahaa Daily Exclusive

  100 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Share

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు. చర్చి మెుత్తాన్ని కలియ తిరిగిన జిష్ణుదేవ్ వర్మ అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
అనంతరం యేసుక్రీస్తు, చర్చిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. గవర్నర్‌కు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. పాఠశాలకు చేరుకున్న జిష్ణుదేవ్ వర్మ అక్కడ విద్యార్థులను కలిసి ముచ్చటించారు. ఆహారం, వసతి సహా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ చర్చిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చర్చి వందేళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయమని, యేసుక్రీస్తు ప్రేమను ఈ చర్చి వందేళ్లుగా పంచుతోందన్నారు. జీసస్ ఏ విధంగా మనల్ని ప్రేమిస్తాడో, అదే విధంగా మనం ఇతరులను ప్రేమించాలని గవర్నర్ పేర్కొన్నరు. బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్స్ బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని మనసారా కోరుతున్నానని, మంచి సంస్కృతి, సంప్రదాయాలతో విద్యార్థులు సమాజంలో ఎదగాలని గవర్నర్ ఆకాంక్షించారు. కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలంటూ, క్రీడలలో బ్యాడ్మింటన్ క్రీడ అంటే నాకు చాలా ఇష్టమన్నారు. నాకు భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శమని, దేశ భవిష్యత్తుకు మీరు పునాదిలాంటి వారన్నారు. సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలని, విద్యాలయాలు దేవాలయాలతో సమానమని, విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలుగుతూ అభివృద్ధిలోకి రావాలన్నారు. మంచి ప్రవర్తనతో చిన్నారులు భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవాలని చెప్పారు.

25 న రానున్న సీఎం రేవంత్ రెడ్డి

కాగా, మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆదివారం నుంచే వందేళ్ల పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చర్చికి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం చర్చి ఆవరణలో ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో జీసస్ జన్మ వృత్తాంతాన్ని తెలిపే నాటక ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.