ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆందోళనకారులు. మృతురాలు రేవతి కుటుంబానికి వెంటనే రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు విసిరారు. ఆయన ఇంట్లోకి నినాదాలు చేసుకుంటూ దూసుకెళ్లేందుకు యత్నించారు. రాళ్లు తగిలి అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్‌లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న ఆయన మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. జరిగిన రాళ్ల దాడిపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను ఇంట్లోని వారితో పాటు సెక్యూరిటీ సిబ్బంది నుంచి వివరాలను సేకరించారు.
జూబ్లీహిల్స్‌లో..
కాంగ్రెస్ నేత, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దిన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో అల్లు అర్జున్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ కేటీఆర్ డైరెక్షన్‌లో నటిస్తున్నారని బాబా పసియుద్దిన్ విమర్శించారు. మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడిన స్క్రిప్ట్ కేటీఆర్ రాసిచ్చిందేనన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్‌తో కేటీఆర్ టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. డ్రామారావు నాటకాలు ఎలా ఉంటాయో 20 ఏళ్ల పాటు తాను దగ్గరగా చూశానన్నారు. కేటీఆర్ ని నమ్ముకుంటే అల్లూ ఫ్యామిలీ రోడ్డున పడ్డట్లేనన్నారు. ఈ ఎపిసోడ్‌ను పొలిటికల్ టర్న్ తిప్పింది బీఆర్ఎస్ నేతలని ఆరోపించారు. అల్లు అర్జున్ రీల్ లైఫ్ లో మాత్రమే హీరో అని, రియల్ లైఫ్‌లో మాత్రం కాదన్నారు. ఆయనలో ఎంత మానవత్వం ఉందో ప్రజలందరికీ అర్థమవుతుందని తెలిపారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై బురద జల్లితే ఊరుకోబోమని హెచ్చరించారు.
అల్లు ఇంటిని ముట్టడిస్తాం..
కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని బాబా పసియుద్దిన్ తెలిపారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామన్నారు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అల్లు అర్జున్ చెప్పడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా వాస్తవాలను ప్రజలకు తెలియజేశారన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుందన్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదన్నారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్‌లో ఎంత సేపు ఉన్నారు.. వెళ్లేటప్పుడు ఎలా వెళ్లారో మొత్తం వివరాలు, ఆధారాలు ఉన్నాయన్నారు.