Mahaa Daily Exclusive

  సంధ్య థియేటర్ ఘటన లైవ్ వీడియో విడుదల చేసిన సీపీ

Share

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఆదివారం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఆయన వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట గురించి చర్చించారు. అనంతరం హీరో అల్లు అర్జున్‌ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తొక్కిసలాటకు సంబంధించి పుర్వాపరాలను వివరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో విడుదల చేశారు.

సినిమా చూశాకే వెళ్తానన్నారు

ఈ ఘటనపై చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఆరోజు జరిగిన విషయాన్ని వివరించారు. తొక్కిసలాట జరిగిన తర్వాత అల్లు అర్జున్‌ మేనేజర్‌ సంతోష్‌ను కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు, పరిస్థితి అదుపు తప్పింది, థియేటర్‌ నుంచి వెళ్లిపోవాలని సూచించామని, అందుకు మేనేజర్‌ తమను అల్లు అర్జున్‌ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. అయినా అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి ఈ విషయం అల్లు అర్జున్‌కు చెప్పామని తెలిపారు. దీంతో ఆయన వెళ్లడానికి అధికారులంతా సహకరించి రూట్‌ క్లియర్‌ చేశారని వివరించారు. దయచేసి ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని చెప్పామని, సినిమా చూసిన తర్వాతే వెళ్తానని అల్లుఅర్జున్ అన్నారని ఏసీపీ తెలిపారు. దాంతో పరిస్థితిపై డీసీపీకి చెప్పినట్లు వివరించారు. ఆయనను కలవడానికి తాము లోనికి వెళ్లిన వీడియోలు ఉన్నాయని, అల్లుఅర్జున్‌తో మాట్లాడే ఫుటేజ్‌ కోసం ప్రయత్నించినా దొరకలేదని ఏసీపీ మీడియాకు వివరించారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగతోందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు.