రాష్ట్రంలో కొత్తగా రెండు నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 12 నూతన మునిసిపాలిటీల ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్, మంచిర్యాలకు నగరపాలక హోదా కల్పించారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే నాలుగు కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి.
అలాగే 12 నూతన మునిసిపాలిటీల ఏర్పాటుపైనా నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పాటు చేసిన పురపాలికల్లో(మునిసిపాలిటీ) ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే నాలుగు ఉన్నాయి. ఈ జిల్లాలో కోహిర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ కొత్త మునిసిపాలిటీలుగా ఆవిర్భవించాయి. మహబూబాబాద్‌లో కేసముద్రం, జనగాం జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్, నారాయణపేటలో మద్దూరు, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, భద్రాదికొత్తగూడెంలో అశ్వారావుపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మొయినాబాద్ కొత్త మునిసిపాలిటీలుగా ఏర్పడ్డాయి
అలాగే, ఇప్పటికే మునిసిపాలిటీలుగా ఉన్న వాటిలో అదనంగా మరికొన్ని గ్రామాలను విలీనం చేశారు. పరిగి మునిసిపాలిటీ పరిధిలో ఆరు గ్రామాలు, నర్సంపేట పరిధిలో ఏడు గ్రామాలను, నార్సింగ్‌లో జన్వాడ, శంషాబాద్‌లో శంకరాపురం, కరీంనగర్ పరిధిలో కొత్తపల్లి మునిసిపాలిటీతోపాటు మరో ఆరు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేసింది. 80 గ్రామ పంచాయతీలను, 12 ఆవాసాలను కొత్త మునిసిపాలిటీల పరిధిలో విలీనం చేశారు. ఈ నూతన మునిసిపాలిటీలకు సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగుల కేటాయింపు తదితర అంశాలపై ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇక, కొత్త నగర పాలక, పురపాలక సంస్థల ఏర్పాటుతో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల(యుఎల్‌బీ) సంఖ్య 153కు పెరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన 12 మునిసిపాలిటీలతో పట్టణ ప్రాంత పరిధి 6000 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.