Mahaa Daily Exclusive

  మున్షీని కలిసిన అల్లు అర్జున్ మామ..! ఎందుకంటే..?

Share

సంధ్య థియేటర్ ఘటన చుట్టూ తెలంగాణ రాజకీయాలు మంట పుట్టిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వెళ్లడం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఆయన మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారని, దీపాదాస్ ఏం మాట్లాడలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘స్వేచ్ఛ – బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తమ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లో ఒకరని అన్నారు.

 

తమను కలవడానికి వచ్చినట్టు ముందుగా సమాచారం లేదని తెలిపారు. అక్కడ ఉన్న మీడియా వాళ్ళని చూసి పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అంటూ ఆయన వెళ్ళిపోయారని చెప్పారు. బయటకు వెళ్లిన వెంటనే తనకు ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. అల్లు అర్జున్ మీద కక్ష చూపించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు మహేష్ గౌడ్. ఆయన మామ కాంగ్రెస్ సభ్యుడే‌ అని, అప్పుడు అల్లు అర్జున్ కూడా తమ కుటుంబ సభ్యుడే అవుతారని పేర్కొన్నారు.

 

చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అల్లు అర్జున్ సంఘటనను బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడాక గానీ ప్రతిపక్షాలకు గుర్తు రాలేదని వ్యాఖ్యానించారు. ఇక, చిత్రసీమ ఆంధ్రాకు వెళ్తుందని చాలా సిల్లీగా మాట్లాడుతున్నారని అన్నారు. అసలు చిత్రసీమ ఇక్కడకు వచ్చిందే కాంగ్రెస్ నాయకుల వల్ల అని గుర్తు చేశారు. ఇండస్ట్రీకి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్.