ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ సాగింది. మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సాగింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఏసీబీ శుక్రవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను ఈనెల 31 వరకు హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను 31వ తేదీకి వాయిదా వేయగా, కేటీఆర్ ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టును విచారణ సందర్భంగా కోరింది. ఇప్పటి వరకు ఫార్ములా ఈరేస్ వ్యవహారానికి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు వినిపించిన తర్వాత కేటీఆర్‌కు హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అయితే దాన్ని కూడా ఎత్తివేయాలని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఏసీబీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ సమయంలో కేటీఆర్‌కు బెయిల్ మంజూరు చేసినా, రిలీఫ్ ఇచ్చినా, నాట్ టు అరెస్ట్ ఇచ్చినా విచారణకు ఇబ్బందికర వాతావరణం ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. నాట్ టు అరెస్ట్‌ను ఎత్తివేయాలని ఏసీబీ మరో పిటిషన్‌ను వేసింది. ఆ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదిగా కేటీఆర్‌ను చేర్చారు. దీంతో కేటీఆర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 31న ఫార్ములా ఈ కార్ రేస్‌పై ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన వాదనలు కొనసాగుతాయి. అలాగే నాట్ టు అరెస్ట్‌పై కేటీఆర్ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరుగనున్నాయి. ఈ రెండు అంశాలపై డిసెంబర్ 31న ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది







