గత ముఖ్యమంత్రి కేసీఆర్ 66రోజులు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గగ్గోలు నడిచింది. తర్వాత ఆరుఖాళీలు ఆరుమాసాలు ఉంచినా.. అదే రగడ. ఆయనే అప్పట్లో కేబినెట్ జాప్య ఒత్తిడిని, విమర్శలను తట్టుకోలేకపోయారు. ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ప్రత్యర్ధుల విమర్శలు.. ఇంకోవైపు సొంతపార్టీ ఆశావహులు ఇలా ఎన్నెన్నో తలపోట్లు ఉన్నా.. అన్నింటినీ తట్టుకుని పదమూడు మాసాలుగా పదమూడు శాఖల భారం మోస్తూ, ప్రధాన ప్రత్యర్ధి బిఆర్ఎస్ ను లోక్ సభలో సున్నాకు పరిమితం చేసి అటు రాజకీయంగా ఇటు ప్రభుత్వపరంగా ఫీల్ గుడ్ వాతావరణం కొనసాగించడమంటే పెద్దసాహసం. ఈ సాహసం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గేమ్ ఛేంజర్ గా మారారు. ఒకప్పుడు కేసీఆర్ కేంద్రంగా సాగిన రాజకీయాలు.. ఇపుడు పూర్తిగా రేవంత్ చుట్టూ తిరుగుతున్నాయి. టార్గెట్ చేసినా, ప్రశంసించినా అన్నింటికీ అయనే కేంద్రం. తెలంగాణ పాలిటిక్స్ పై, ప్రభుత్వంపై పూర్తిపట్టు సాధించిన సీఎం 2024 తనదేనని చాటారు. వినూత్న పథకాలు, కార్యక్రమాలు, రాజకీయాలతో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.
కలిసొచ్చిన కాలం
ఈ ఏడాది మహేష్ కుమార్ గౌడ్ కు డబుల్ బొనాంజా లభించింది. ఓ వైపు ఎమ్మెల్సీ, మరో వైపు పిసిసి చీఫ్ రెండు పదవులూ దక్కాయి. రాష్ట్రంలో కాలం కలిసొచ్చిన టాప్ లీడర్ గా మహేష్ కుమార్ గౌడ్ కు గుర్తింపు లభించింది. ఇక కరీంనగర్ ఎంపీగా ఉన్న బండిసంజయ్ మరో సారి గెలిచి కేంద్రకేబినెట్ లో బెర్త్ సాధించి ప్రమోషన్ కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసిరాకున్నా వెంటనే లోక్ సభలో విజయభేరి మోగించి అటు ఈటల రాజేందర్, ఇటు రఘునందన్ రావు తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. మరోవైపు డికె అరుణ కూడా గత ఎన్నికల్లో మిస్ అయినా.. ఈ దఫా గురిచూసి సాధించారు. ఇక భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విజయం సాధించగా, తన పనితీరుతో ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. నల్లగొండ ఎంపీగా రఘువీర్ రెడ్డి కూడా అరంగేట్రంలోనూ రికార్డు విక్టరీ సాధించారు. వరంగల్ నుండి కడియం కావ్య, పెద్దపల్లి నుండి కాకా మనవడు వంశీక్రిష్ణ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి 2024ను మైలురాయిగా మలుచుకున్నారు.
కారుపార్టీకి రాహుకాలం
ఇక 2024 గత ఏడాది కంటే ఇంకా నిరాశపరిచింది. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం షాక్ గా మారగా, కవిత అరెస్ట్ ఆ పార్టీని కుంగదీసింది. పార్టీ పుట్టిన తర్వాత చరిత్రలో మొదటిసారి ఒక్క ఎంపీ కూడా దక్కని దారుణస్థితికి వెళ్ళగా, కేసీఆర్ కుమార్తె ఐదుమాసాల పాటు జైల్లో ఉండడం ఆ పార్టీ శ్రేణులను నైతికంగా ఇబ్బందిపెట్టింది. సోషల్ మీడియాలో జోరుమీదున్నా ప్రజాక్షేత్రంలో పరపతి పెంచుకునేవిషయంలో ప్రయత్నాలు ముందుకుసాగడం లేదు. కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికే పరిమితం కాగా, కేటీఆర్ ను వివిధ ఆరోపణలు చుట్టుముట్టి కేసులు నమోదవుతున్నాయి. ఎమ్మెల్యేలు పలువురు పార్టీ మారగా, ఇంకొందరు మారొచ్చన్న ప్రచారాలున్నాయి. 2023ని మించి 2024 బిఆర్ఎస్ ను ఇబ్బందిపెట్టింది.
కమలానికి జోష్
గత ఏడాది 8ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఈ ఏడాది రికార్డుస్థాయిలో 8 ఎంపీ స్థానాలు గెలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా 8 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. అయితే తర్వాత ఆ జోష్ ను కొనసాగించడంలోవెనుకపడింది. నూతన అధ్యక్షుని నియామకంలో జాప్యం, నేతల మధ్య అంతర్గత వైరుధ్యాలు పార్టీ ముందడుగుకు అవరోధాలు కలిగిస్తుండగా, భవిష్యత్తుపై మాత్రం ధీమాగా ఉంది. మొత్తంగా 2024 కమలానికి కలిసొచ్చిన వత్సరమే.







