- శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
- ప్రధాని మోడీ, అమిత్ షా సహా కేంద్రమంత్రుల నివాళులు
- మన్మోహన్ కు కడసారి వీడ్కోలు పలికిన సోనియా
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్రనేతల నివాళి
ఢిల్లీ, మహా
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో రాజ్‌ఘాట్ సమీపంలో నిర్వహించనుంది. అంతిమ యాత్ర ఉదయం 9.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమౌతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. “ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ఉంది. రేపటి ఉదయం వరకు ప్రజలు అక్కడి వచ్చి నివాళులు అర్పించవచ్చు. డిసెంబర్ 28న అంటే శనివారం ఉదయం 8 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తాం. అక్కడ ఉదయం 8.30 నుంచి 9.30 మధ్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించేందుకు అవకాశం ఇస్తాం. 9.30 గంటల తరువాత అక్కడి నుంచి శ్మశాన వాటికకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మొదలవుతుంది” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
ఘన నివాళులు
అనారోగ్య సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈ ఉదయం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పుష్పాంజలి
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ సహా పలువురు పార్టీ నేతలు మన్మోహన్ సింగ్ భౌతికఖాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయపార్టీల ముఖ్యనేతలు, ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. భారత సైన్యం తరఫున సైనికాధికారులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండా ఉంచి సెల్యూట్ చేశారు.
బెళగావ్ నుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. భేల్గావ్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యుసి సభ్యులు మంత్రి దామోదర్ రాజా నర్సింహ, ఎంపీ లు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు వెళ్ళారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మన్మోహన్ దేశానికి చేసిన సేవలను సీఎం రేవంత్ కొనియాడారు.
చంద్రబాబు నివాళులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.







