సినిమా అన్నది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, ప్రజలను ప్రభావితం చేసే ఉన్నతమైన మాధ్యమం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ నిర్వహించిన అలనాటి మహానటి, నిర్మాత, గాయని కృష్ణవేణి సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్రాలు కళాత్మకంగా, సందేశాత్మకంగా ఉండాలని చెప్పారు. చెడు పనులను గొప్పగా చూపించేలా కథానాయకుల పాత్రలను రూపొందించటం సరి కాదన్నారు. సినిమాకు వెళితే సందేశం అందాలన్నారు. మానసిక ఉల్లాసం, సంతోషం కలగాలన్నారు. సినిమా రంగంలో ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ సంప్రదాయాలు, మంచి భాష, హుందాతనానికి పెద్దపీట వేయవలసిన అవసరం ఉందన్నారు. భాష విషయంలోనూ నాటి దర్శక, నిర్మాతలు, రచయితల స్ఫూర్తిని సినీ రంగం అందిపుచ్చుకోవాలన్నారు. . ముఖ్యంగా ద్వంద్వార్థాలకు తావు లేని, హుందాతనంగా ఉండే భాషను వాడాలన్నారు. యువతరం సినిమా నుంచి ప్రభావితం అవుతారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాల్లో జుగుప్సాకరమైన, అశ్లీల సన్నివేశాలకు తావు లేకుండా మంచి కథలను తెరకెక్కించాలని సూచించారు. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు లేకుంటే సినిమాలు ఆడవనే భ్రమ సరైనది కాదని సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి ముందు నుంచి… నిన్నటి “సీతారామం” వరకూ అనేక చిత్రాలు, అలాంటి సన్నివేశాలు లేకుండానే విజయం సాధించాయని చెప్పారు. సినిమాను, బాధ్యతాయుతమైన వ్యాపారంగా నాటి సినీ రంగ ప్రముఖులు అభివృద్ధి చేశారని, అలాంటి వారిలో కృష్ణవేణి వంటి వారు మొదటి వరుసలో నిలుస్తారని అన్నారు. నటిగా, గాయనిగా, నిర్మాతగా అనేక పార్శ్వాల్లో తమ ప్రతిభతో ఆకట్టుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి గారు అని చెప్పారు.
101 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన కృష్ణవేణి తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి… ఈరోజు ప్రపంచ స్థాయి వరకూ ఎదగడం వరకూ ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. తెలుగువారి ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు సహా ఎందరో ప్రతిభావంతులను సినీ రంగానికి కృష్ణవేణి పరిచయం చేశారన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి జనార్ధన్ గారు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, దివంగత ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.







