- జూన్ మొదటి వారంలో ‘ఇండియా’ కూటమి భేటీ.
- మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.
కోల్‌కతా,మహా.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌పై ఎంతటి సుదీర్ఘ రాజకీయ పోరాటానికైనా విపక్షాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరోధించడానికి అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ‘ఇండియా’ కూటమి ప్రతినిధులు జూన్ మొదటి వారంలో కీలక సమావేశం కాబోతున్నట్లు ఆమె ఆదివారం నాడు వెల్లడించారు.
“మేము దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. చివరి శ్వాస వరకు మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు” అని మమతా బెనర్జీ తన ఫేస్బుక్ లైవ్ ప్రసంగంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే వేదిక ద్వారా ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
150 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు: దీదీ సంచలన ఆరోపణలు
ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని దాదాపు 150 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చిన ప్రజాతీర్పును కుట్రపూరితంగా తారుమారు చేశారని ధ్వజమెత్తారు. “నిజానికి గెలిచే స్థానాలను ఓడే స్థానాలుగా, ఓడిపోయే స్థానాలను గెలిచే స్థానాలుగా మార్చేశారు. ఈ విధమైన అక్రమ తారుమారులు గనుక జరగకపోయి ఉంటే.. టీఎంసీకి ఈ ఎన్నికల్లో ఏకంగా 220 నుంచి 230 స్థానాలు దక్కేవి” అని మమత పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో జరిగిన లోపాలపై మమత మాట్లాడుతూ.. “మొదట్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 60 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి అక్రమంగా తొలగించారు. ఆ తర్వాత మా నిరసనలతో చాలా పేర్లను మళ్లీ చేర్చినప్పటికీ, వివిధ దశల్లో పోలింగ్, లెక్కింపు సమయంలో తీవ్ర అక్రమాలు, తప్పులు జరిగాయని మాకు పక్కా సమాచారం ఉంది. అందుకే ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనుమానాలు ఉన్న ఆయా నియోజకవర్గాల్లో టీఎంసీ చట్టపరంగా కోర్టును ఆశ్రయించబోతోంది” అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత బీజేపీ తమ పార్టీ కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రాజకీయ ఒత్తిడిలకు, బెదిరింపులకు గురిచేస్తోందని దీదీ ఆరోపించారు. అయితే, వీటన్నింటికీ తట్టుకొని తాము నిలబడుతున్నామని చెబుతూ.. “బెంగాల్లో టీఎంసీని బీజేపీ ఎంతగా ఇబ్బంది పెడితే, దిల్లీలో ఆ కాషాయ పార్టీకి అంతకంటే రెట్టింపు సమస్యలు ఎదురవుతాయి” అని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం టీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు కొత్త ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ ప్రజాస్వామ్య పరిధిని తగ్గిస్తోందని విమర్శించారు. “కొంత మంది నాయకులు స్వార్థంతో పార్టీ మారవచ్చు.. కానీ బెంగాల్ ప్రజలు ఇప్పటికీ మా వైపే ఉన్నారు. మేము మళ్లీ వైభవంగా పుంజుకుంటాం” అని మమత ధీమా వ్యక్తం చేశారు.
కుట్ర కథలతో ఓటమిని కప్పిపుచ్చుకుంటున్నారు: తిప్పికొట్టిన బీజేపీ
మమతా బెనర్జీ చేసిన తీవ్ర ఆరోపణలను సీనియర్ బీజేపీ నాయకురాలు కేయా ఘోష్ అంతే బలంగా తోసిపుచ్చారు. మమత బెనర్జీ క్షేత్రస్థాయి వాస్తవాలను, ప్రజా తీర్పును అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కుట్ర కథల ద్వారా తన ఘోర ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి నిరర్థక ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. “2011, 2016, 2021 ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన విజయాలను అప్పట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఒప్పుకున్న టీఎంసీ అధినేత్రి, ఇప్పుడు తాము ఓడిపోయేసరికి అకస్మాత్తుగా ఎన్నికల పద్ధతిపై ఎందుకు బురదజల్లుతున్నారు?” అని కేయా ఘోష్ ప్రశ్నించారు. ‘మమతా బెనర్జీకి రాజ్యాంగంపై, ఎన్నికల వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదు. ఆమె దృష్టిలో ఎన్నికల్లో గెలవడం అంటే కేవలం బూత్ లాక్కోవడం (జామింగ్), హింసకు పాల్పడటం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం మాత్రమే’ అని ఘోష్ దుయ్యబట్టారు.
మమత పొలిటికల్ బలం శూన్యం.. టీఎంసీ ఒక కార్పొరేట్ కంపెనీ!
రాష్ట్రంలో మమతా బెనర్జీ రాజకీయ బలం పూర్తిగా క్షీణించిందని కేయా ఘోష్ వ్యాఖ్యానించారు. టీఎంసీలో అంతర్గతంగా పెరుగుతున్న తీవ్ర అసంతృప్తి కారణంగానే ఆ పార్టీ కార్యకర్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు క్రమంగా పార్టీని వీడుతున్నారని పేర్కొన్నారు. “తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలా లేదు.. అది కేవలం అభిషేక్ బెనర్జీ చుట్టూ తిరిగే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ లాగా మారిపోయింది” అని తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల విడుదలైన ఫాల్తా ఫలితాలను గుర్తు చేస్తూ, ఒకప్పుడు టీఎంసీకి తిరుగులేని బలమైన కోటలుగా భావించిన ‘డైమండ్ హార్బర్’ లాంటి నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైన రాజకీయ మార్పు కనిపిస్తోందని ఘోష్ పేర్కొన్నారు. చివరకు మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన ‘భవానీపూర్’ లోనే ఓడిపోవడం.. టీఎంసీ నాయకత్వానికి వ్యతిరేకంగా మారిన ప్రజల మూడ్‌ను, ఆ పార్టీని బెంగాల్ ప్రజలు పూర్తిగా తిరస్కరించారనే నిజాన్ని స్పష్టం చేస్తోందని కేయా ఘోష్ ఘాటుగా సమాధానమిచ్చారు.







