గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు వెళ్ళడించారు. ప్రజా ప్రభుత్వం సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎల్ బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు హాజరైన భట్టి ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత పదేళ్లు పాలించిన ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదంటూ ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసమే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామన్నారు. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారని చెప్పారు.
సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ, సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని, ఇందులో 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.







