తాళం వేసిన ఇళ్లు, ఏటీఎం, దుకాణాలు ఏది కనిపిస్తే అది.. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొని.. తర్వాత రోజు చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా ఓ ఏటీఎం భారీ చోరీ జరిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రావిర్యాల ఏటీఎంలోకి దొంగలు చొరబడి కట్టర్ , ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి.. భారీగా నగదు ఎత్తుకెళ్లారు.
ఏటీఎం చోరీ జరిగిందిలా
ఆదివారం తెల్లవారు జామున రావిర్యాల వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు కారులో కొందరు దుండగులు వచ్చారు. ముందుగా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి.. సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. తర్వాత తమతో పాటు తెచ్చుకున్న ఇనుప సామాన్లతో ఏటీఎం మిషన్ ను బద్దలు కొట్టారు. అందులో ఉన్న మొత్తం డబ్బును తీసుకొని పారిపోయారు. దొంగలు ఏటీఎంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్లిపోయే వరకు పట్టిన సమయం కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే. ఈ లోపే వాళ్లు అనుకున్న పని కానిచ్చేశారు. విషయం తెలుసుకున్న క్రైమ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ రాజు ఘటనా స్థలంలోని ఏటీఎంలో చోరీ ఎలా జరిగిందనే విషయంపై అక్కడి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు చోరీ జరిగిందని ని బ్యాంక్ మేనేజర్ ను అడగ్గా.. రెండు రోజుల క్రితమే ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.







