Mahaa Daily Exclusive

  30 మాసాల్లోనే అందుబాటులోకి రానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ..!

Share

కేంద్ర ప్రభుత్వం కొత్తగా అనుమతించిన మామునూరు ఎయిర్‌పోర్టును రాబోయే 30 మాసాల్లో పూర్తి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మామునూరు ఎయిర్‌పోర్ట్‌ క్లియరెన్స్‌ ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ. ఈ విమానాశ్రయం గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉండేది. 1981 వరకు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగుతుండేవని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని, పదేళ్లలో దేశంలోని ఎయిర్‌పోర్టుల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని వివరించారు. చిన్న చిన్న నగరాల్లోనూ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేశామని, వరంగల్‌ వంటి నగరంలో ఎయిర్‌పోర్టు విషయంలో అడుగులు ముందుకుపడలేదన్నారు. తెలుగు ప్రజల మంత్రిగా పని చేయాలని చంద్రబాబు మార్గనిర్దేశం చేశారని, ఏపీ కోసం ఎలా పని చేస్తావో.. అదే చిత్తశుద్ధితో తెలంగాణ కోసం కూడా పనిచేయాలని సూచించారని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణలోనూ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని కిషన్‌రెడ్డి సూచించారని, మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్‌ విషయంలో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. ఎయిర్‌పోర్టుకు 2800 మీటర్ల రన్‌వే అవసరమని, 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు గతంలోనే వచ్చాయని, గత ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేనందు వల్లే ఆలస్యమైందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అవుతాయని, భూసేకరణ పూర్తయిన రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్‌వోసీ తీసుకొని క్లియరెన్స్‌ ఇచ్చామన్నారు. భద్రాద్రి ఎయిర్‌పోర్టు విషయంలో గతంలో ఒక స్థలాన్ని ప్రతిపాదించారని, ఆ స్థలం ఫీజిబులిటీగా లేదని మంత్రి తేల్చి చెప్పారు. మరో స్థలం ప్రతిపాదించారని, భద్రాద్రి విషయంలో కొత్త స్థలంపై ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

వరంగల్ ప్రజల చిరకాల కోరికను నా హయంలో క్లియరెన్స్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఆనందంతో తెలిపారు. వాస్తవానికి 1981 వరకు వరంగల్ ఎయిర్ పోర్ట్ లో కార్యక్రమాలు జరిగేవని, హైదరాబాద్ అభివృద్ధి జరగడంతో వరంగల్ ఎయిర్ పోర్ట్ లో కార్యక్రమాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో ఓకె ఒక్క ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉందని, వరంగల్ ఎయిర్ పోర్ట్ క్లియరెన్స్ లో జాప్యానికి కారణాలు రెండున్నాయన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగిందని, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్, ఉపాధి,అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని ణంత్రి వివరించారు. వరంగల్ విద్యకు, పర్యాటకానికి ప్రధానమైన నగరమని, ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో దేశంలో ప్రధాన నగరాలతో వరంగల్ పోటీ పడగలదన్నారు.

కేసీఆర్ సహకరించలేదు : కిషన్ రెడ్డి

వరంగల్ లో ఏయిర్ పోర్టు నిర్మాణం చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రల డిమాండ్ కు అనుగుణంగా కేంద్రం ఎయిర్ పోర్ట్ ను నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేసి లేఖల రూపంలో చర్చలు జరిపిందన్నారు. గతంలో విమానయాన మంత్రిగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా స్వయంగా అప్పటి సిఎం కేసీఆర్ తో మాట్లాడారన్నారకు. అయినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో అనుమతుల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. వరంగల్ కు ఎయిర్ పోర్టు మంజూరు చేసినందుకు ప్రదాన మంత్రి నరేదంర్ మోడీకి తెలంగాణ ప్రజల తరఫున కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.