కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు హాజరవడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రతిపక్ష పార్టీలను పిలిచి, ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ కుల గణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితిలో, విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను పిలిపించడం ఏంటని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. ఈ ఘటనతో మున్నూరు కాపు నేతల అసంతృప్తి, కాంగ్రెస్ లో అసహనం స్పష్టంగా కనిపించింది. ఈ సమావేశం తర్వాత ఏఐసీసీ స్పందన ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని, పార్టీ నియమాలను పాటించవలసిన అవసరం ఉందని అధిష్టానం సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. కులగణన తప్పంటూ ప్రపభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా సీరియస్ కామెంట్లు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన నేపథ్యంలోనే మున్నూరు కాపు నేతలతో తన నివాసంలో హన్మంతరావు సమావేశం నిర్వహించడాన్ని కాంగ్రెస్ సీరియస్ గా పరిగణిస్తోంది. హన్మంతరావు నుంచి వ్యక్తి గత వివరణ తీసుకోవాలని టీ పీసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ అంశంపై వీహెచ్ స్పందించారు. ఒకరిద్దరికి కోపం రావచ్చు నిన్న మీటింగ్ లో సీఎంను ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు, జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు, దాని మీద సీఎంతోనే మాట్లాడుతా, సీఎం తో మాట్లాడిన తర్వాత మున్నూరు కాపు సభ తేదీ ఖరారు చేస్తామని వీహెచ్ స్పష్టం చేశారు.







