వనపర్తిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన తనకు.. సొంత అక్కలా ప్రేమ, ఆప్యాయత చూపిన పార్వతమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన రేవంత్రెడ్డి.. పార్వతమ్మ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. గతంలో వనపర్తి పట్టణంలోని పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉండి ఇంటర్ వరకు చదివారు. ఆ నాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. పార్వతమ్మ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి తమ్ముడు రావడం పట్ల పార్వతమ్మ ఆనందభాష్పాలతో ఆహ్వానం పలికారు. కుటుంబ సభ్యులంతా సీఎంతో కలిసి ఫొటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు.
‘‘ఇది రక్త సంబంధం కాదు…
అంతకంటే ఎక్కువైన అనుబంధం…
వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ…
ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను ఆస్వాదిస్తూ పెరిగా…
ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని…
ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా’’ అంటూ రేవంత్రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.







