వరంగల్ మహా;
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింప వచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారమగుచూ పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానంలో 29-04-2025 నుండి 10-05-2025 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడే శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిగింది. ఉదయం 4-00లకు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి ఉత్సవాంగీకార ప్రార్ధన జరిపారు. అనుజ్ఞ లభించిన వెంటనే అమ్మవారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యహవాచనం, నాంది, ఇడాహవాచనం, బ్రహ్మకూర్చహెూమం, పంచగవ్య ప్రాశన, ఋత్విగ్వరణం, మధుపర్కవిధి జరిపి వాస్తుయాగం, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, ధ్వజాధివాస కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి ఉదయం గణపతి సేవను, సాయంకాలం శ్రీ సుబ్రహ్మణ్య సేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిపారు. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ప్రతిసరబంధం, ఉదకశాంతి నిర్వహించి రక్షోఘ్న హెూమం అనంతరం బ్రహ్మోత్సవ అంకురార్పణ జరిపి సాయంత్రం పూజ నిర్వహించారు. ఈ అంకురార్పణ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయానికి విచ్చేసిన మున్నూరుకాపు సంఘం సభ్యులు వందలాదిగా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య నేతృత్వంలో మేళతాళాలతో పట్టుచీరలు, పూజాద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ కార్యనిర్వహధికారి శేషు భారతి తెలిపారు.







