కరీంనగర్, మహా:
వక్ఫ్ నిబంధనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి, పేద మధ్యతరగతి ముస్లింల ప్రయోజనాలు, సంక్షేమం అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం చేపట్టిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, వక్ఫ్ బోర్డు సవరణ కమిటీ తిమ్మాపూర్ మండల ప్రోగ్రాం కన్వీనర్ బూట్ల శ్రీనివాస్ అధ్యక్షతన వక్ఫ్ చట్ట సవరణ -2025 జన జాగరణ అభియాన్ మండల కార్యశాల ప్రోగ్రాం సోమవారం రోజున కొత్త పల్లి లోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఆయన మాట్లాడుతూ వక్ఫ్ అనేది ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇవ్వబడిన తిరిగి ఇవ్వలేని దాతృత్వ నిధి అన్నారు. భారతదేశంలో 1996 నుండి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. 2018 కేంద్రీయ వక్ఫ్ పరిషత్ నివేదిక ప్రకారం భారత్లో 10 లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ కు ఆస్తులు ఉన్నాయని తెలిపారు.
అయితే వక్ఫ్ యొక్క పాలన వ్యవస్థ బలహీనంగా ఉండి , బోర్డులో ఎవరు ఎవరికి జవాబు దారి గా ఉండడం లేదని , ఆ కారణం చేతనే మోడీ ప్రభుత్వం వక్ఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి వీలుగా వక్ఫ్(సవరణ) చట్టం-2025ను ప్రవేశపెట్టిందన్నారు. ప్రధానంగా వక్ఫ్ పెద్ద మొత్తంలో ఆస్తులు కలిగి ఉన్న ముస్లిం సమాజ ప్రయోజనాలు ,సంక్షేమం అభివృద్ధి కోసం వక్ఫ్ పనిచేసిన దాఖలాలు ఏమీ లేవని, ముస్లిం సమాజాన్ని దోచుకుందని ఆరోపించారు. ముస్లిం ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన వక్ఫ్ భారత్లో అన్నింటికన్నా పెద్ద స్కామ్ గా తయారైందన్నారు. లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న వక్ఫ్ ముస్లిం సమాజ సంక్షేమ, అభివృద్ధి కోసం ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ఈరోజుకి 31 శాతం ముస్లింలు దారిద్యరేఖకు దిగువనే జీవితాలను గడుపుతున్నారని , వారికి చేయూతనివ్వాలనే ఆలోచన వక్ఫ్ ఏనాడూ చేయలేదన్నారు. ప్రధానంగా వక్ఫ్ భూములలో షాపింగ్ మాల్స్, హోటల్లు, వ్యాపార భవనాలు విలసిల్లుతున్నాయి కానీ పేద ముస్లింలకి ఇప్పటికీ ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదన్నారు. 80 శాతం వక్ఫ్ భూములు అవినీతి, అక్రమ కబ్జాలకు గురయ్యాని పేర్కొన్నారు. ముస్లిం వర్గాల సేవ కోసం ఉద్దేశించిన వక్ఫ్ భూమి కొంతమంది వ్యక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంగా మారిందన్నారు.2018 లో కేంద్ర వక్ఫ్ పరిషత్ వెలువరించిన నివేదికలో వక్ఫ్ బోర్డులో ఏలాంటి పారదర్శకత లేదని, అవినీతి పతాకాస్థాయిలో ఉందని పేర్కొన్న విషయాన్ని ఆయనఈ సందర్భంగా గుర్తు చేశారు.2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం విద్య, ఉద్యోగం, ప్రభుత్వ సేవల పరంగా ముస్లింల పరిస్థితి దళితుల కన్నా అద్వాన స్థితిలో ఉందని , ఈ పరిస్థితిని మెరుగుపరచకపోతే ఎవరి సంక్షేమం కోసం చట్టం తయారు చేయబడిందో ఆ చట్టం ద్వారానే దోపిడి గురయ్యే అవకాశం ఉందన్నారు.వక్ఫ్ స్కాలర్షిప్ నిధులు నకిలీ లబ్ధిదారుల పేరుతో దోపిడీకి గురయ్యాయని , దీంతో అసలైన పేద ముస్లిం విద్యార్థులు చదువుకునే అవకాశం కోల్పోయారని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయని, మిగిలిన ఆస్తులు ,మాల్స్, హోటల్లు, పరిశ్రమలకు నామమాత్రపు లీజుకు కట్టబెట్టారన్నారు. గత వక్ఫ్ బోర్డులో ఉన్న లోపాలను సరి చేస్తూ మోడీ ప్రభుత్వం చట్టంలో సవరణలు చేపట్టిందన్నారు. అయితే ఇన్నాళ్లు వక్ఫ్ ఆస్తులను దోచుకున్నోళ్లకు, సొమ్మును అనుభవించిన కొంతమందికి సవరణ చట్టం మింగుడు పడడం లేదని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం పేద ముస్లిం సమాజ ప్రయోజనాలు సంక్షేమ అభివృద్ధి కోసమేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి, మోడీ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇట్టి ప్రోగ్రాంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మండల కన్వీనర్ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కమిటీ కో కన్వీనర్లు గడ్డం శ్రీనివాస్ రెడ్డి , బోనాల మోహన్ ,మండల ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు,జిల్లా ఓబీసీ కార్యదర్శి ఎర్రోజు లక్మన్ , బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరుణ్,బూత్ అధ్యక్షులు బండి స్వామి, తమ్మణవేని మహేష్, గొల్లపల్లి మల్లేశం గౌడ్,సుద్దాల సతీష్,పుట్ట ఓంకార్,లెనిన్, సిరిసిల్ల నర్సయ్య, ఇజ్జగిరి హరీష్,వరుకోలు రాజయ్య,మల్లెతుల అశోక్, వినవంక అంజయ్య, కొత్తూరు శ్రీనివాస్ ,చిందం అంజి తదితరులు పాల్గొన్నారు.







