రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాలుష్యం లేని నూతన పరిశ్రమల శంకుస్థాపనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యఅతిథిగా హాజరై ఇబ్రహీంపట్నంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన 17 దుకాణ సముదాయాలను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం గ్రామ శివారు నుంచి సుమారు మూడు కోట్ల 50 లక్షలతో ఎమ్మెల్యే బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, రైతు భరోసా డబ్బుల మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసి, రైతాంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.
ఇబ్రహీంపట్నంలోని మార్కెట్ యార్డ్ లో నూతనంగా నిర్మించిన దుకాణ సందేహాలను ఈ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మార్కెట్లోని దుకాణాలు రైతులకు మాత్రమే కేటాయించాలని, రైతులకు కాకుండా వేరొకరికి కేటాయించరాదని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డులో రైతులకు అన్ని విధాలుగా ఉండేలా ఒక భవనాన్ని, మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన తెలిపారు.
యాచారం మండలంలోని ఫార్మాసిటీని రద్దు చేయడం జరిగిందని రైతులకు తెలిపారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు రావాల్సిన పరిహారం ఇప్పించడం జరుగుతుందని అన్నారు. కొంత మంది రైతులు పరిహారం తీసుకుని భూములను తిరిగి ఇవ్వమని అనేది సమంజసం కాదని, ప్రభుత్వం ఒకసారి భూ ఆక్ట్ ప్రకారం భూమిని సేకరిస్తే మళ్లీ తిరిగి ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. గ్రీన్ సిటీకి ఫోర్త్ సిటీకి రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇస్తామని ముందుకు వచ్చినప్పుడు మాత్రమే, ప్రభుత్వం సేకరిస్తుందని రైతులకు ఇష్టం లేకుండా బలవంతపు భూసేకరణ చేయదని ఆయన రైతులకు తెలిపారు. ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యత కలిగిన వృత్తిలో శిక్షణ పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని స్థాపించడం జరుగుతుందని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 40 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆసుపత్రి పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.
అనంతరం ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ లో ఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మలపల్లి గుర్నాథ్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.








