బలమైన రాష్ట్రాలతోనే నవభారత నిర్మాణం.
* స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్’ మంత్రంతో ఏపీ అడుగులు.
* మాకు ఇగోలు లేవు.. రాష్ట్ర ప్రగతే మా లక్ష్యం.
* పారిశ్రామికవేత్తలకు కేవలం వాట్సాప్ దూరంలోనే ఉంటా.
* కోల్‌కతా ఐసీసీ ప్లీనరీ సదస్సులో పెట్టుబడిదారులకు మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం.
కోల్‌కతా,మహా.
రాష్ట్రాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా బలంగా ఉన్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధించిన బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉద్ఘాటించారు. రాష్ట్రాల మధ్య నెలకొనే ఆరోగ్యకరమైన పోటీ దేశాభివృద్ధికి నిజమైన చోదకశక్తిగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కోల్‌కతాలోని ఐటీసీ సోనార్ హోటల్ వేదికగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఆధ్వర్యంలో ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. పారిశ్రామిక రంగంలో నూతన విప్లవానికి తెరలేపిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో దేశ, విదేశీ పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సుస్థిర ప్రగతితో ముందుకెళ్తోందని, కేంద్రం పారిశ్రామిక రంగంలో తీసుకొస్తున్న నూతన సంస్కరణలను ఆచరణలో పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటుతోందని మంత్రి వివరించారు. ముఖ్యంగా దేశంలోకి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం ఏపీకే దక్కుతుండటం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన గర్వంగా చెప్పారు. తమ రాష్ట్రం ప్రధానంగా ‘స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్’ అనే మూడు మూలస్తంభాల ఆధారంగా ముందుకు సాగుతోందని లోకేశ్ స్పష్టం చేశారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకే పరిమితం కాకుండా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గూగుల్ లాంటి గ్లోబల్ సంస్థ పెట్టుబడిని 13 నెలల్లోనే సాధించడం, ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టును ఖరారు చేయడం, పుట్టపర్తిలో 37 రోజుల రికార్డు వ్యవధిలోనే 600 ఎకరాలు సేకరించి పరిశ్రమకు శంకుస్థాపన చేయడం తమ వేగానికి ఉదాహరణలని వివరించారు. పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే, ప్రభుత్వాన్ని కేవలం ఒక నియంత్రణ సంస్థగా కాకుండా సేవలు అందించే భాగస్వామిగా మలుచుకున్నామని తెలిపారు. మార్వాడీల వ్యాపార సూత్రమైన ‘కస్టమర్ ఈజ్ గాడ్’ స్ఫూర్తితోనే పారిశ్రామికవేత్తలను దేవుళ్లుగా భావించి సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇదే సదస్సులో పశ్చిమ బెంగాల్‌తో ఉన్న అనుబంధాన్ని, ఆ రాష్ట్ర ప్రాముఖ్యతను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బెంగాల్ ఈరోజు ఏది ఆలోచిస్తుందో, రేపు యావత్ భారతదేశం అదే ఆలోచిస్తుందనే నానుడిని తాను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగానని గుర్తుచేసుకున్నారు. భారత దేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రస్థానానికి కోల్‌కతాయే అసలైన రాజధాని అని కితాబిచ్చారు. అంతకుముందు రోజు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్వయంగా కలిసిన విషయాన్ని పంచుకుంటూ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం భావోద్వేగాలతో ముడిపడి ఉన్న భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏ విధంగా సేకరించగలిగామో ఆమెకు వివరించినట్లు తెలిపారు. అభివృద్ధి పట్ల మమతా బెనర్జీకున్న అంకితభావం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆయన ప్రశంసించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అపార అనుభవం, దార్శనికతతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల బృహత్తర ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ లక్ష్యమని లోకేశ్ ఉద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రానున్న జులై నెలలో ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు, మంగళగిరిలో అంతర్జాతీయ స్థాయి జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్నది యువశక్తి, నైపుణ్యంతో నిండిన కేబినెట్ అని, తమకు ఎలాంటి ఇగోలు, అహాలు లేవని, కేవలం రాష్ట్ర అభివృద్ధి సాధించాలనే కసితో మాత్రమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు తాను కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలోనే అందుబాటులో ఉంటానని, వారు రాష్ట్రంలో పెట్టే ప్రాజెక్టును తమ సొంత ప్రాజెక్టుగా భావించి వేగంగా అనుమతులు ఇప్పించే బాధ్యత తనదేనని లోకేశ్ అభయమిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో ఐసీసీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు కేశవ్ భజంక సహా పలువురు జాతీయ స్థాయి కార్పొరేట్ ప్రముఖులు పాల్గొన్నారు.







