రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్స్, అసోసియేషన్ ల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపుమేరకు, 2025 జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిఐటియు ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపల్ కార్మికులకు సమ్మె కరపత్రాలు పంచుతూ అనంతరం మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డి కిషన్ మాట్లాడుతూ… శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలలోని 24 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్ లు గనుక అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందని, కార్మికుల సమిష్టి భేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతుందని ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు కార్మికులు కోల్పోవాల్సి వస్తుందని, అంతేకాకుండా కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్ ల అమలును తక్షణమే రద్దు చేయాలని, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి మున్సిపాలిటీలను బలోపేతం చేయాలని, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ.26000/లుగా నిర్ణయించాలని, మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్స్ కల్పించాలన్నారు. అలాగే కార్మికులు వివిధ కారణాల రీత్యా మరణిస్తే దహన ఖర్చులకు 30 వేల రూపాయలు కేటాయించాలని అన్నారు. ఎక్స్ గ్రేషియా రూ.5లక్షలు ఇచ్చి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, వారాంతపు సెలవులతో పాటు పండుగల సందర్భంగా సెలవులు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెరుగుతున్న పట్టణ విస్తరణకనుగుణంగా కొత్త సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఈ మహేష్ ఏ రవి, ఎం సుధాకర్, ఎన్ వెంకటేష్, సిహెచ్ అంజయ్య, జె సరిత, ఎస్ నరేష్, కే మంజుల తదితరులు పాల్గొన్నారు.








