Mahaa Daily Exclusive

  తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం….

Share

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం.
* ముగ్గురు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా.
* ఈపీఎస్ వైపు ఐదుగురు ఎమ్మెల్యేల పునరాగమనం.
* సెమ్మలై అవుట్.. అన్నాడీఎంకేలో తీవ్ర సంక్షోభం.
* ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం.
* తమిళనాడులో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు.

చెన్నై,మహా.
తమిళనాడు రాజకీయాల్లో చకచకా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చెన్నై సచివాలయంలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ తక్షణమే ఆమోదించారు.
**ఉప ఎన్నికల రేస్.. టీవీకే వైపు చూపు..**
రాజీనామా సమర్పించిన వారిలో మదురాంతకం నియోజకవర్గ ఎమ్మెల్యే మరగాథం, ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ, పెరుందురై ప్రతినిధి జయకుమార్ ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా పత్రాలు నిర్ణీత విధానాల ప్రకారం సరైన ఫార్మాట్‌లో ఉన్నందున ఆమోదించినట్లు స్పీకర్ ప్రభాకర్ తెలిపారు. పదవి నుంచి వైదొలగడానికి గల కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో మదురాంతకం, ధారపురం, పెరుందరై నియోజకవర్గాలతో పాటు రెండు స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన వెంటనే ఈ ముగ్గురు నేతలు సచివాలయంలోని టీవీకే మంత్రి ఆదవ్ అర్జునను కలిశారు. వీరు త్వరలోనే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష సమయంలో అన్నాడీఎంకే విప్‌ను ధిక్కరించి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు.
**తిరిగి పళనిస్వామి గూటికి ఐదుగురు ఎమ్మెల్యేలు**
మరోవైపు షణ్ముగం-వేలుమణి అసమ్మతి వర్గానికి గట్టి షాక్ తగిలింది. ఈ రెబెల్ క్యాంప్‌లో ఉన్న ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి పార్టీ అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామి వైపు మళ్లారు. దీంతో అసెంబ్లీలో పళనిస్వామికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల బలం 27కు చేరింది. అసమ్మతి వర్గాన్ని వీడిన వారిలో ఎస్.ఎం. సుకుమార్ (ఆర్కాట్), పి. హరిభాస్కర్ (అంతియూర్), దిలీపన్ జైశంకర్ (శంకరన్‌కోయిల్), ఎన్.ఎస్.ఎన్. నటరాజన్ (కాంగేయం), కె. మోహన్ (పన్రుట్టి) ఉన్నారు. ఈ ఐదుగురు గ్రీన్‌వేస్ రోడ్‌లోని పళనిస్వామి నివాసానికి వెళ్లి తిరిగి పార్టీలో విలీనమయ్యారు. అనంతరం స్పీకర్ ప్రభాకర్‌ను కలిసి తాము పళనిస్వామి నాయకత్వంలోనే పనిచేస్తామని లేఖ సమర్పించారు. బలపరీక్ష సమయంలో జరిగిన తప్పుల పట్ల చింతిస్తూ ప్రధాన కార్యదర్శికి లేఖ ఇచ్చినట్లు సుకుమార్ వెల్లడించారు. తాజా పరిణామాలతో రెబెల్ వర్గం బలం 25 నుంచి 17కు పడిపోయింది.
**అన్నాడీఎంకేకు భారీ ఎదురుదెబ్బ.. సీనియర్ నేత సెమ్మలై రాజీనామా**
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 21 రోజుల్లోనే అన్నాడీఎంకేలో ఈ చీలిక, రాజీనామాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షణ్ముగం పార్టీ విప్‌ను ధిక్కరించారని ఈపీఎస్ ఆరోపించగా, ఈపీఎస్ నియమించిన విప్ అధికారాన్నే షణ్ముగం ప్రశ్నించారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు ఎస్. సెమ్మలై సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాతి పరిణామాలు తనకు, లక్షలాది మంది కార్యకర్తలకు తీవ్ర మానసిక వేదన కలిగించాయని పేర్కొంటూ తన రాజీనామా లేఖను ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి పంపారు.
**స్థిరంగా విజయ్ సర్కార్**
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 59, అన్నాడీఎంకే 47 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీల మద్దతుతో విజయ్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సమయంలో అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో విజయ్ ప్రభుత్వ బలం 144కు చేరింది.