రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల వైభవం.
• పురస్కారాలు అందుకున్న తెలుగు ప్రముఖులు.
• తొలి విడతలో 68 మందికి పద్మ పురస్కారాలు.
• దివంగత ధర్మేంద్రకు పద్మవిభూషణ్.
• హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ ప్రదానం.
ఢిల్లీ, మహా.
దేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అత్యంత అట్టహాసంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. మొదటి విడతలో భాగంగా ఇద్దరికి పద్మవిభూషణ్, ఆరుగురికి పద్మ భూషణ్, 58 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా బహూకరించారు.
**ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్**
భారతీయ చలనచిత్ర రంగానికి అద్భుత సేవలు అందించిన బాలీవుడ్ దిగ్గజ నటుడు దివంగత ధర్మేంద్రకు ప్రకటించిన ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని ఆయన సతీమణి, ప్రముఖ నటి హేమమాలినీ స్వీకరించారు. అవార్డు ప్రదాన సమయంలో ధర్మేంద్ర కుమార్తె అహానా డియోల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గౌరవం తమ కుటుంబానికే కాకుండా యావత్ దేశానికి ఆనంద క్షణమని హేమా మాలిని పేర్కొన్నారు. ఈ పురస్కారం ముందే వచ్చి ఉంటే ధర్మేంద్రజీతో పాటు ఆయన అభిమానులు ఎంతో సంతోషించేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కళల విభాగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ఎన్. రాజమ్ సైతం పద్మ విభూషణ్ పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
**హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ.. ప్రముఖులకు పద్మభూషణ్**
క్రీడల విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజావ్యవహారాల విభాగంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, కళల విభాగంలో ఆర్. గణేశ్, వాణిజ్యం-పరిశ్రమల విభాగంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్లు పద్మ భూషణ్ అవార్డులు స్వీకరించారు. ప్రజావ్యవహారాల విభాగంలో మరణానంతరం వీకే మల్హోత్రాకు ప్రకటించిన పద్మ భూషణ్‌ను ఆయన కుమారుడు అందుకున్నారు.
**తెలుగు రాష్ట్రాల విజేతలు వీరే..**
వైద్య విభాగంలో తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడూరు వెంకట్ రావు, డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి పద్మ పురస్కారాలు అందుకున్నారు. కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డి కళల విభాగంలో అవార్డు స్వీకరించారు. సాహిత్యం-విద్య విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మ పురస్కారాన్ని అందుకున్నారు. అన్నమాచార్య సంకీర్తన ప్రచారకుడు, దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మ అవార్డును ఆయన కుమారుడు స్వీకరించారు.
**మొత్తం 131 పురస్కారాలు**
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2026 సంవత్సరానికి గాను మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో ఐదు పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పద్మశ్రీ గ్రహీతలలో 45 మంది అన్సంగ్ హీరోలను (గుర్తింపునకు నోచుకోని ప్రముఖులు) కేంద్రం ఎంపిక చేసింది. మిగిలిన అవార్డులను రెండో విడత కార్యక్రమంలో అందజేస్తారని అధికార వర్గాలు వెల్లడించారు.
**25-05-2026 నాటి అధికారిక జాబితా వివరాలు:**
**పద్మవిభూషణ్ గ్రహీతలు:**
1. ధర్మేంద్ర (మరణానంతరం) – కళలు (మహారాష్ట్ర)
2. ఎన్.రాజాం – కళలు (ఉత్తరప్రదేశ్)
3. అచ్యుతానందన్ (మరణానంతరం) – ప్రజావ్యవహారాలు (కేరళ)
4. కె.టి.థామ్స్ – చట్టం-ప్రజావ్యవహారాలు (కేరళ)
5. పి.నారాయణన్ – సాహిత్యం (కేరళ)
**పద్మభూషణ్ గ్రహీతలు:**
1. నోరీ దత్తాత్రేయుడు (వైద్యం) – అమెరికా
2. మమ్ముట్టి (కళలు) – కేరళ
3. అల్కా యాజ్ఞిక్ (కళలు) – మహారాష్ట్ర
4. కల్లిపట్టి రామసామి పళనిస్వామి (వైద్యం) –
5. పీయూష్ పాండే (మరణాంతరం) (కళలు) – మహారాష్ట్ర
6. కేఎం మెయిలానందన్ (సామాజిక సేవ) – తమిళనాడు
7. శతావధాని ఆర్ గణేశ్ (కళలు) – కర్ణాటక
8. శిబూ సోరెన్ (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు) – ఝార్ఖండ్
9. ఉదయ్ కొటక్ (వాణిజ్యం-పరిశ్రమలు) – మహారాష్ట్ర
10. వీకే మల్హోత్రా (మరణాంతరం) (ప్రజావ్యవహారాలు) – దిల్లీ
11. వెల్లప్పల్లి నటేశన్ (ప్రజావ్యవహారాలు) – కేరళ
12. అమృత్‌రాజ్ (క్రీడలు) – అమెరికా
13. భగత్‌సింగ్ కోశ్యారీ (ప్రజావ్యవహారాలు) – ఉత్తరాఖండ్







