ఆదిలాబాద్, మహా
…………..
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రానికి చెందిన ఈయన పేరు ఎల్లన్న. 90శాతం వికలాంగత్వం ఉంది. గత నాలుగేళ్ల క్రితం ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేశారు. కానీ ఇప్పటికీ ఆయనకు మంజూరు కాలేదు. ఇలాంటి అర్హులైన వారు జిల్లాలో అనేక మంది ఉన్నారు.
……….
ప్రభుత్వం మారినా కొత్త పింఛన్లకు మోక్షం లభించడం లేదు. గత సర్కారు హయాంలో జరిగిన జాప్యమే తాజాగానూ చోటు చేసుకుంటోంది. ఆసరా పింఛన్ల కోసం అర్హులైన వారు ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఫలితంగా వయసు పైబడి పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేలాది మంది లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. 2019 నుంచి కొత్త పింఛన్ల మంజూరు కాకపోవడంతో ప్రభుత్వం వద్ద అర్హులైన వారి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. పింఛన్ కోసం దరఖాస్తులు చేసిన వారు రోజువారీగా ప్రభుత్వ కార్యాలయాలకు వరుస కడుతున్నారు. ఇఫ్పుడు..అప్పుడూ అంటూ అధికారులు దాటవేస్తున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆసరా లబ్ధిదారుల పట్ల కరుణ చూపాలని కొత్త పింఛన్ లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
వేలాది మంది ఎదురుచూపు
ప్రభుత్వం వద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కళ్లుగీత, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 74,159మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు రూ.3వేలు అందిస్తుండగా.. మిగితా అందరికీ రూ.2వేల చొప్పున అందజేస్తోంది. గతంలో పింఛన్ వయస్సు 60 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం ఈ వయస్సును 57 సంవత్సరాలకు కుదించింది. దీంతో అనేక మంది లబ్ధిదారులు వీటి కోసం దరఖాస్తులు చేశారు. 2019 నుంచి కొత్త వాటిని మంజూరు చేయకపోవడంతో ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 57 సంవత్సరాలు రాగానే పింఛన్ కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మంజూరు చేయడం లేదు. వీటికి తోడు కొంతమంది వికలాంగులుగా మారుతుండటం..సదరం సర్టిఫికేట్ పొందడం..మరికొంత మంది వితంతువులుగా మారిన వారు వీటి కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 4168మంది దరఖాస్తులు అందించినట్లు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత అదనంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోపక్క ఇటీవల కొందరు వితంతువులకు పింఛన్లు అందించగా.. మిగితా వారిని మాత్రం విస్మరించడం పట్ల ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా కరుణ చూపి మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రూ.4వేల పింఛన్ ఊసే లేదు..
గత ప్రభుత్వం పింఛన్ దారులకు ప్రతి నెలా రూ.2వేల చొప్పున అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్ ను రూ.4వేల చొప్పున అందిస్తామని భరోసా ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పెంచిన పింఛన్ ఊసు లేకుండా పోయింది. ఎప్పటి వరకు అందిస్తారో కూడా అధికారులకు సైతం స్పష్టత లేకుండా పోయింది. ప్రస్తుతం ప్రతి నెలా రూ.2వేల పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సైతం పెంచిన పింఛన్ కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీంతో రూ.4వేల పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.








