ఖమ్మం,మహా.
వరద ఉధృతి అంచనాలను సమర్థవంతంగా అందించాలని, ఆ దిశగా పటిష్ట వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి విపత్తుల సన్నద్దతపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విపత్తుల గురించి మనకు ఎంత త్వరగా తెలిస్తే అంత త్వరగా ప్రజల సంరక్షణకు చర్యలు తీసుకోవచ్చని అన్నారు. వరద అంచనా వ్యవస్థ కట్టుదిట్టంగా పని చేయాలని, నీటి వనరుల్లో నీటి నిల్వలు, పైన ఉన్న మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో కురిసే వర్షాలు, వస్తున్న వరద వివరాలను నీటి పారుదల శాఖ అధికారులు రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు.
భద్రాచలంలో వరద ఉధృతి సంబంధించి పకడ్బందీ వ్యవస్థ ఉందని, భద్రాచలం వద్ద వరద వివరాలు ప్రతి గంటకు తెలుస్తాయని, ఆ దిశగా ఖమ్మం జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వరద ఉధృతి ఎప్పటికప్పుడు సమర్థవంతంగా అంచనా వేయాలని అన్నారు.
తీర్థాల, మున్నేరు, ఆకేరు, తదితర వాటి వద్ద నీటి ప్రవాహం, నీటి నిల్వ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని అన్నారు. జిల్లాలో అవసరమైన చోట వాటర్ గేజ్ ఏర్పాటు చేయాలని అన్నారు. గత వరదలను దృష్టిలో ఉంచుకొని మన జిల్లాకు వరద ఎంత వస్తుంది అనే సమాచారం ముందుగానే అందేలా చూడాలని, దీనికి సంబంధించి బాధ్యతలను నీటిపారుదల శాఖకు అప్పగిస్తూ మెమో జారీ చేయాలని అన్నారు.
జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో వాట్సాప్ గ్రూప్ తయారు చేసి, ప్రతి నీటి వనరుల పరిస్థితులు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని అన్నారు. వాటర్ గేజ్ జిల్లాలో ఎక్కడ పెడ్తారు వంటి వివరాలను, రాబోయే 3 నెలల పాటు రిపోర్టింగ్ షెడ్యూల్ సిద్దం చేసి సోమవారం నాటికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
విపత్తుల సమయంలో ప్రజలకు కమ్యూనికేషన్ చాలా వేగంగా జరగాలని అన్నారు. మున్నేరు నది ఖమ్మం నగరానికి మొదటి, రెండవ, మూడవ ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేయాలి, ఏ హెచ్చరిక సమయంలో ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతాయి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఎస్.ఓ.పి. సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం అర్బన్, రూరల్ ప్రాంతాలలో వరద విపత్తు నిర్వహణ బాధ్యత అధికంగా రెవెన్యూ వ్యవస్థపై ఉంటుందని, అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న నీటి వనరులను పరిశీలించి తెగిపోకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్.ఇ. ఎం. వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్రాం, ఖమ్మం ఆర్డిఓ జి. నరసింహారావు, ఇర్రిగేషన్ డి.ఇ. లు, ఖమ్మం అర్భన్, రూరల్ తహసిల్దార్ లు సైదులు, రాంప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








