Mahaa Daily Exclusive

  రేషన్ బియ్యం దారి మళ్లింపు: ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల్లో భారీ అక్రమాలు!

Share

  • దారి మల్లుతున్న సన్న బియ్యం
  • ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగుల్లోనూ అక్రమాలు
  • పౌరసరఫరాల శాఖ దాడుల్లో వెలుగులోకి

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం, రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యంలో అక్రమాలు జరుగుతున్నాయి. కొందరు రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, గోదాముల యజమానులు, దళారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో విజిలెన్స్ విభాగం అధికారులు గడిచిన వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో రూ.కోట్ల విలువైన ధాన్యం, సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. కమలాపూర్ మండలానికి చెందిన ఓ రైస్ మిల్లర్ కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీతో కుమ్మక్కయ్యాడు. నకిలీ రైతుల పేర్లు సృష్టించి, 8049.6 క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు విజిలెన్స్ అధికారులు కమిషనర్ కు నివేదించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.86 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై శాయంపేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు అయ్యింది.

బియ్యంతో పాటు గోధుమలు

రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం, గోధుమలు అక్రమార్కులపరమవుతున్నాయి.
రేషన్ కార్డు దారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో అధికారులు మూడు చోట్ల భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం, గోధుమలు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 13న బాలాపూర్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ షెడ్ లో 200 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 14న గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ గోదాం నుంచి 55 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 10 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. 15న పహాడిషరీఫ్ లోని ప్రైవేట్ గోదాంలో 996 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 144.3 క్వింటాళ్ల గోధుమలు, 6,300 ఖాళీ గన్నీ బ్యాగులు (సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లేబుళ్లతో) పట్టుకున్నారు.