బొట్టు, తిలకం వివాదం.
* ఒక్కరోజులోనే లెన్స్‌కార్ట్‌కు రూ.4,540 కోట్ల నష్టం.
* లెన్స్‌కార్ట్‌కు నెటిజన్ల షాక్.. షేర్ల పతనం.
* దిగివచ్చి క్షమాపణలు చెప్పిన పీయూష్ బన్సల్.
ముంబై, మహా.
ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ ‘లెన్స్‌కార్ట్’ అనూహ్య వివాదంలో చిక్కుకుని భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఉద్యోగుల వస్త్రధారణ, ఆహార్యానికి సంబంధించి ఆ సంస్థ గతంలో రూపొందించిన ఒక పాత అంతర్గత ‘స్టైల్ గైడ్’ పత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడమే ఈ తాజా దుమారానికి కారణమైంది. పని వేళల్లో ఉద్యోగులు బొట్టు (బిందీ), తిలకం వంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదని ఆ పత్రంలో ఉన్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా కంపెనీపై విమర్శల వర్షం కురిసింది. ‘బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో ఆ సెగ నేరుగా స్టాక్ మార్కెట్‌కు తాకింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో లెన్స్‌కార్ట్ షేర్లు దాదాపు ఐదు శాతం మేర పతనమై రూ.508.70 కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత వారం రూ.92,872 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ, సోమవారం ఒకానొక దశలో రూ.88,331 కోట్లకు పడిపోయింది. దీంతో ట్రేడింగ్ సమయంలో ఆ సంస్థ సుమారు రూ.4,540 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. అయితే, మధ్యాహ్నం తర్వాత షేరు కొద్దిగా కోలుకుని రూ.530.60 వద్దకు చేరడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.92,038 కోట్ల వద్ద స్థిరపడింది.
వివాదం తీవ్రరూపం దాల్చడం, వేల కోట్ల రూపాయల సంపద కళ్లెదుటే ఆవిరవుతుండటంతో లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారు. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వివాదాస్పద పత్రం చాలా పాతదని, అది కంపెనీ ప్రస్తుత విధానాలను ఏమాత్రం ప్రతిబింబించదని ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థలో బొట్టు, తిలకాలతో సహా ఎలాంటి మతపరమైన చిహ్నాలపై నిషేధం లేదని తేల్చిచెప్పిన ఆయన, జరిగిన ఈ అపార్థానికి, ప్రజల ఆందోళనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు ప్రకటించారు. ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలికే దిశగా లెన్స్‌కార్ట్ యాజమాన్యం వెంటనే ఒక కొత్త ‘ఇన్-స్టోర్ స్టైల్ గైడ్’ను అధికారికంగా విడుదల చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎలాంటి అభ్యంతరం లేకుండా బిందీలు, తిలకాలు, సింధూరం, మంగళసూత్రాలు ధరించవచ్చని స్పష్టం చేసింది. అలాగే హిజాబ్‌లు, తలపాగాలు, కడాలు కూడా నిస్సందేహంగా అనుమతిస్తామని తెలిపింది. తమ బృంద సభ్యుల మతపరమైన మనోభావాలను, సంప్రదాయాలను పూర్తిగా గౌరవిస్తామని కంపెనీ పునరుద్ఘాటించింది. ఒక చిన్న కమ్యూనికేషన్ లోపం లేదా పాత నిబంధన సామాజిక మాధ్యమాల కాలంలో కార్పొరేట్ సంస్థల ఉనికిని, మార్కెట్ విలువను ఎంతలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఈ లెన్స్‌కార్ట్ ఉదంతం ఒక ఉదాహరణగా నిలిచింది.







