Mahaa Daily Exclusive

  42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం..బీసీ బంద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

Share

  • రాష్ట్రంలో బీజేపీ మద్దతిచ్చి.. కేంద్రంలో వెనకడుగు
  • 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తాం
  • బీసీ బంద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, మహా: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తామని, హైకోర్టులో త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి బీసీ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించి బీసి రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ఆమోదించామని అన్నారు. అనంతరం ఆ బిల్లు గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిందన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్లిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతోనే బీసీ బిల్లు ఆమోదం పొందిందని అన్నారు.

బంద్ ప్రభావం కేంద్రంపై పడాలి..
నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇక న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తామని.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని అన్నారు. బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు మద్దతుతో బంద్‌కు పిలుపునివ్వడం ప్రశంసనీయమని అన్నారు. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేశాయని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నప్పటికీ అయినప్పటికీ బంద్ ప్రభావం కేంద్రంపై పడాలన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి, మిగతా ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల ఆకాంక్షలను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయాలన్నారు