Mahaa Daily Exclusive

  అర్ధరాత్రి ఆకలి కేకలు….

Share

*అర్ధరాత్రి ఆకలి కేకలు.
* ప్లేట్లతో రోడ్డెక్కిన శ్రీ చైతన్య విద్యార్థులు.
* క్యాంపస్ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ.
* లక్షలు ఫీజులు.. నాణ్యత లేని భోజనం.
* ఖమ్మంలో విద్యార్థుల నిరసన జ్వాల
* యాజమాన్యం మొండివైఖరిపై ఆగ్రహం.
* బల్లేపల్లిలో ఉద్రిక్తత

ఖమ్మం బ్యూరో, మహా.

ఖమ్మం విద్యానగరంలో సోమవారం రాత్రి అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చదువుల ఒత్తిడితో సతమతమయ్యే విద్యార్థులు, కడుపు మాడుతుంటే తట్టుకోలేక రోడ్డెక్కారు. లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నా, కనీస మౌలిక సదుపాయమైన నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని అర్ధరాత్రి వేళ నిరసన గళం విప్పడంతో బల్లేపల్లి ప్రాంతంలో కలకలం రేగింది.

ఖమ్మం పట్టణంలోని బల్లేపల్లిలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాల బ్రాంచ్‌లో సోమవారం రాత్రి విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఈ క్యాంపస్ హాస్టల్‌లో సుమారు 250 మంది విద్యార్థులు ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హాస్టల్‌లో పెడుతున్న భోజనం ఏమాత్రం బాగోలేదని, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి వడ్డించిన భోజనం కూడా నాణ్యతగా లేకపోవడంతో, రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితులను భరించలేక విద్యార్థులు తిరుగుబాటు చేశారు. ఆకలితో అలమటించిన విద్యార్థులు తమ నిరసనను తెలియజేసేందుకు చేతిలో భోజనం ప్లేట్లు పట్టుకుని మూకుమ్మడిగా క్యాంపస్ నుంచి బయటకు వచ్చారు. బల్లేపల్లిలోని కాలేజీ క్యాంపస్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తీవ్రతరం చేశారు. విద్యార్థుల ఆందోళనతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తల్లిదండ్రులు తమ చదువుల కోసం కష్టపడి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో చెల్లిస్తున్నారని, కానీ యాజమాన్యం మాత్రం కనీసం రుచికరమైన భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం, కూరలు ఏమాత్రం తినేలా ఉండటం లేదని వాపోయారు. భోజన సదుపాయాల లేమిపై గతంలోనే పలుమార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, తమ సమస్యను గాలికి వదిలేశారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.