Mahaa Daily Exclusive

  ఖమ్మం ఖిల్లాపై చెరిగిపోని కాంగ్రెస్ ముద్ర..

Share

ఖమ్మం ఖిల్లాపై చెరిగిపోని కాంగ్రెస్ ముద్ర..
* పల్లె తీర్పుతో విపక్షాల విలవిల!
ఖమ్మం బ్యూరో, మహా.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో ఈ పంచాయతీ ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతాయి. ఖమ్మం గడ్డపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టు ఎంతటిదో ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. మధిర, వైరా, పినపాక ఇలా నియోజకవర్గం ఏదైనా ఫలితం మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గింది. ముఖ్యంగా మధిర ,వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన క్లీన్ స్వీప్ విజయాలు, ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లోని ఏకపక్ష ఫలితాలు ఆ పార్టీ క్యాడర్ బలానికి నిదర్శనం. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు ఒక పీడకలలా మారాయి. గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడం, క్యాడర్ లో నైరాశ్యం, నాయకుల వలసలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కేవలం నామమాత్రపు ఉనికిని చాటుకోవడానికి పరిమితం కాగా, కాంగ్రెస్ మాత్రం 80 శాతానికి పైగా పంచాయతీలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పన్నినా, కూటములు కట్టినా ఖమ్మం ఓటరు మాత్రం కాంగ్రెస్ వైపే నిలిచాడు. ఒక్క ఓటు తేడాతో గెలిచిన తెల్లపాలెం నుంచి 3200 ఓట్ల మెజారిటీతో గెలిచిన అశ్వాపురం వరకు ప్రతి గెలుపులోనూ కాంగ్రెస్ శ్రేణుల కష్టమే అధికం.

సంక్షేమమే గెలుపు మంత్రం.. మహిళా శక్తిదే అసలైన ప్రజాస్వామ్య విజయం!

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతటి భారీ విజయాలను నమోదు చేయడానికి ప్రధాన కారణం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేనని నిర్వివాదాంశం. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్లుగా మారారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలు వారిని విపరీతంగా ఆకర్షించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం, అందులోనూ పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం స్పష్టమైన మార్పుకు సంకేతం. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమని కొట్టిపారేయలేం, ఇది ప్రభుత్వ పనితీరుపై మహిళలు ఇచ్చిన విశ్వాస తీర్పు. గడపగడపకూ చేరిన సంక్షేమ ఫలాలు, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును నల్లేరు మీద నడకలా మార్చాయి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందుతున్న ప్రత్యక్ష లబ్ధికే ప్రజలు పట్టం కట్టారని ఈ ఫలితాలు విశ్లేషిస్తున్నాయి. మహిళలు తలచుకుంటే ప్రభుత్వాలను నిలబెట్టగలరు, కూల్చగలరు అనే సత్యం మరోసారి రుజువైంది.

*ఏజెన్సీలో ఎగిరిన జెండా.. అడవి బిడ్డల
ఆత్మబంధువుగా మారిన హస్తం!*

ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన పరిణామం ఏజెన్సీ ప్రాంతాల్లో చోటుచేసుకుంది. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా, ఆ తర్వాత బీఆర్ఎస్, వామపక్షాల కంచుకోటలుగా ఉన్న భద్రాద్రి ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. చర్ల, పినపాక, బూర్గంపాడు మండలాల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలు అద్భుతం. చర్ల మండలంలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం, పినపాకలో బీఆర్ఎస్-సీపీఎం కూటమిని చిత్తుగా ఓడించడం సామాన్యమైన విషయం కాదు. గిరిజన బిడ్డలు, అడవి బిడ్డలు పూర్తిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని ఈ ఫలితాలు తేల్చిచెబుతున్నాయి. పోడు భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చూపిన చొరవ, ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలు గిరిజనులను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయి. బీఆర్ఎస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజన వర్గాలు, ఇప్పుడు హస్తం గూటికి చేరడం ఆ పార్టీకి భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగించే అంశం. అడవి బిడ్డలు తమ ఆత్మబంధువుగా కాంగ్రెస్ ను ఎంచుకున్నారని చెప్పడానికి ఈ ఏకపక్ష విజయాలే సాక్ష్యం.

వర్గ పోరులోనూ వదలని పట్టు.. భవిష్యత్ రాజకీయాలకు ఈ ఫలితాలే అసలైన దిక్సూచి!

ఖమ్మం రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే రఘునాథపాలెం మండల ఫలితాలు ఈసారి కూడా ఉత్కంఠను రేపాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మండలంలో బీఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకోవడం పైకి ఆ పార్టీ విజయంగా కనిపిస్తున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే అది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల ఫలితమేనని అర్థమవుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు, రెబల్స్ బెడద, టికెట్ల కేటాయింపులో లోపాలు బీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి. అయినప్పటికీ, మెజారిటీ స్థానాలను అంటే సుమారు 20కి పైగా పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులే కైవసం చేసుకోవడం ఆ పార్టీ పట్టును నిరూపిస్తోంది. నాయకుల మధ్య సమన్వయం ఉంటే, ఫలితాలు మరింత ఏకపక్షంగా ఉండేవని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక వామపక్షాలు తమ కంచుకోటలను కాపాడుకోగా, టీడీపీ నామమాత్రపు బోణీ కొట్టింది. మొత్తంగా చూస్తే, ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఒక స్పష్టమైన దిక్సూచి. కాంగ్రెస్ పార్టీకి ఇది శుభసూచకం కాగా, బీఆర్ఎస్ కు ఆత్మరక్షణలో పడాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తున్నాయి.