Mahaa Daily Exclusive

  ఇరాన్‌కు ఆర్థిక సాయం ఉండదు…

Share

ఇరాన్‌కు ఆర్థిక సాయం ఉండదు..
* ఆస్తుల విడుదలా లేదు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
ఢిల్లీ, మహా.
ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు తాము ఎలాంటి నగదు ఇవ్వడం లేదని, అలాగే వారి ఆస్తులను కూడా విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే, ఒకవేళ పరిస్థితులు డిమాండ్ చేస్తే అత్యవసరంగా ఇరాన్‌కు ఆహారాన్ని మాత్రమే కొనుగోలు చేసి ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల విషయంలో సానుకూల పరిణామం చోటుచేసుకుందని, అక్కడ ఎలాంటి టోల్ ఛార్జీలు లేకుండా నౌకల సంచారానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు.
మంగళవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. ఆంక్షల సడలింపుల ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా అమెరికా ట్రెజరీ ద్వారా విడుదల చేయబడే నిధులన్నీ వాషింగ్టన్ పూర్తి నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని ఆయన అందులో వివరించారు. ఈ నిధులను ఇరాన్ కేవలం ఆహారం, అత్యవసర వైద్య సామాగ్రిని కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని స్పష్టం చేశారు. ఆ నిధుల వినియోగం మొత్తం అమెరికా పర్యవేక్షణలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, టెహ్రాన్‌లో అణు తనిఖీలు జరగనున్నాయంటూ వస్తున్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌లో అణు కేంద్రాలను పరీక్షిస్తామన్న అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) చీఫ్ గ్రోసీ ప్రకటనను ఇరాన్ దౌత్యవేత్తలు తోసిపుచ్చారు. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా దెబ్బతిన్న తమ అత్యంత సున్నితమైన అణు కేంద్రాలను లేదా అణు రసాయన నిల్వలను పరిశీలించేందుకు ఐఏఈఏ ప్రతినిధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది కుండబద్దలు కొట్టారు.