Mahaa Daily Exclusive

  మన్యం అడవుల్లో నెత్తుటి ఉదయం…

Share

మన్యం అడవుల్లో నెత్తుటి ఉదయం.
* చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.
* తొమ్మిది మంది దుర్మరణం
* అరకు యాత్ర విషాదాంతం.
* భద్రాచలం వెళ్తుండగా మృత్యువొడిలోకి.
* చిత్తూరు వాసుల బస్సు ప్రమాదంలో ఐదుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్, మహా.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగాల్సిన విహారయాత్ర అంతులేని విషాదాన్ని మిగిల్చింది. దైవ దర్శనాలకు, ప్రకృతి అందాలను వీక్షించడానికి బయలుదేరిన పర్యాటకుల బస్సు మృత్యుశకటంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. అరకు నుండి భద్రాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాజుగారిమెట్ట వద్ద అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, మరో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ప్రమాద తీవ్రత ఎంత భయానకంగా ఉందంటే, బస్సు లోయలో పడిన ధాటికి పూర్తిగా నుజ్జునుజ్జయింది. తలకిందులుగా పడిపోయిన బస్సు కింద నలిగిపోయిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన వారితో పాటు బెంగళూరుకు చెందిన పర్యాటకులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మొత్తం 35 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో బస్సు (ఏ పి 39 యూ ఎం 6543) గురువారం అరకులో పర్యటించి, అక్కడి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. ప్రాథమికంగా 15 మంది చనిపోయినట్లు భావించినా, అధికారుల ధ్రువీకరణ అనంతరం మృతుల సంఖ్య తొమ్మిదిగా తేలింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని తొలుత చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం మరియు రాజమండ్రి ఏరియా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతులంతా చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఘాట్ రోడ్డు మలుపుల వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విహారయాత్రకు వచ్చి విగతజీవులుగా మారిన వారిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.