టీ న్యూస్‌కు కవిత అల్టిమేటం.
* వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!
* నాపై విషప్రచారం చేస్తే సహించేది లేదు.
* మాధవరం, మహేశ్వర్‌రెడ్డి, టీ న్యూస్‌లకు కవిత హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కల్వకుంట్ల కవిత తన ప్రత్యర్థులపై న్యాయపరమైన అస్త్రాలను సంధించారు. తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ వార్తా ఛానల్ ‘టీ న్యూస్’ యాజమాన్యానికి, అలాగే తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డిలకు ఆమె న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరువు నష్టం దావా వేస్తానని కవిత ఆ నోటీసుల్లో స్పష్టంగా హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీకి, గులాబీ దళపతి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ, పార్టీ ప్రచార బాధ్యతలను మోస్తున్న టీ న్యూస్ ఛానల్‌కే కవిత నోటీసులు ఇవ్వడం గమనార్హం. గత కొంతకాలంగా కవితకు, పార్టీలోని కీలక నేతలైన హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్‌ల వర్గాలకు మధ్య తీవ్రమైన అంతర్గత పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీ న్యూస్ ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తనపై అసత్య కథనాలను ప్రసారం చేస్తోందని, ఇది పూర్తిగా తన ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగమేనని కవిత ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు తన ప్రసంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఛానల్ పైనే ఆమె ఇప్పుడు ‘ఫాల్స్ ప్రొపగండా’ (తప్పుడు ప్రచారం) ఆరోపణలు చేయడం కుటుంబంలోని చీలికను స్పష్టం చేస్తోంది.
మరోవైపు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇటీవల కవితను ఉద్దేశించి చేసిన వ్యక్తిగత దూషణలను ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. కవిత భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆయన చేసిన ఆరోపణలు, “నా జోలికి వస్తే నీ చిట్టా విప్పుతా” అంటూ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె పేర్కొన్నారు. అలాగే బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కవితపై చేసిన అవినీతి ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కవిత తన నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయ విమర్శల ముసుగులో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేది లేదని ఆమె తేల్చిచెప్పారు.







