Mahaa Daily Exclusive

  ఏదో ఒక రోజు నేనూ సీఎం అవుతా..*నేను గాంధీని కాదు.. ఒక దెబ్బ కొడితే రెండు కొడతా: మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు.

Share

ఏదో ఒక రోజు నేనూ సీఎం అవుతా..
* అప్పుడు ఒక్కొక్కడి తోలు తీస్తా!
* 2014 నుంచి జరిగిన అన్ని అక్రమాలపై విచారణ జరిపిస్తా
* ఇది కేవలం టాస్ మాత్రమే.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది.
* నేను గాంధీని కాదు.. ఒక దెబ్బ కొడితే రెండు కొడతా: మీడియా సమావేశంలో కవిత సంచలన వ్యాఖ్యలు.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు టైం వస్తుందని, ఏదో ఒక రోజు తాను కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు వస్తే.. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతి విషయంపైనా సమగ్ర విచారణ జరిపిస్తానని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్, బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తాను గానీ, తన భర్త గానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లబ్ధి పొందలేదని కవిత స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టాను తాను ఇంకా పూర్తిగా విప్పలేదని, ఇప్పుడు జరుగుతున్నది కేవలం ‘టాస్’ మాత్రమేనని, త్వరలోనే వారి అవినీతి, అక్రమాలపై అసలైన ‘టెస్ట్ మ్యాచ్’ ఆడబోతున్నానని వ్యాఖ్యానించారు. దీనికే ఉలిక్కిపడితే ఎలా అని ప్రశ్నించిన ఆమె, బీఆర్ఎస్ నేతలు చేసిన పాపాలను, అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
గతంలో పాలసీల పేరుతో అక్రమాలకు కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు వాళ్లు బాటలు వేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రహదారులు వేస్తోందని కవిత ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్ హయాంలో అనేక చెరువులను ప్రైవేట్ బిల్డర్లకు అభివృద్ధి పేరుతో కట్టబెట్టారని మండిపడ్డారు. ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్ కు ఇచ్చారని, ఆ సంస్థలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్ గా ఉన్నారని ఆమె బయటపెట్టారు. మాధవరం కృష్ణారావు వెనుక ఉన్న ‘గుంట నక్క’ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్ రావుపై ఆరోపణలు చేస్తే మధ్యలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపైనా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉందని విమర్శించారు. అధికారంలోకి రాగానే గత పదేళ్ల అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ కు కూడా భాగం ఉన్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానని, కానీ చేయని తప్పును ఎప్పటికీ ఒప్పుకోనని కవిత తేల్చిచెప్పారు. తాను గాంధీ లాగానో, కేసీఆర్ లాగానో మంచిదాన్ని కాదని, తనను ఒక దెబ్బ కొడితే తిరిగి రెండు దెబ్బలు కొట్టే నైజం తనదని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం అవసరమైనప్పుడు తన సొంత నగలు కుదువపెట్టాను తప్ప, ఎన్నడూ అక్రమాలకు పాల్పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని శంకించేలా మాట్లాడితే ఊరుకునేది లేదని, దమ్ముంటే తాను చేసిన ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పాలని కవిత సవాల్ విసిరారు.