Mahaa Daily Exclusive

  * ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌పై జర్మన్ ఎంపీల ప్రశంసలు.

Share

పెట్టుబడులకు రెడ్ కార్పెట్.. యువతకు కొత్త అవకాశాలు
* ఐటీ, డిఫెన్స్, ఫార్మా రంగాల్లో జర్మనీతో జాయింట్ వెంచర్లకు సిద్ధం.
* రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జర్మన్ సంస్థలకు పూర్తి సహకారం.
* స్కిల్ వర్సిటీలో ప్రత్యేకంగా ‘జర్మన్ లాంగ్వేజ్’ విభాగం.
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
* ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌పై జర్మన్ ఎంపీల ప్రశంసలు.

హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల వేటలో మరో కీలక ముందడుగు వేసింది. భారత్-జర్మనీ మధ్య ఉన్న చారిత్రక మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జర్మనీ పార్లమెంటు సభ్యుల బృందంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ప్రధానంగా ఐటీ, డిఫెన్స్, ఏరోస్పేస్, మరియు ఫార్మా రంగాల్లో జర్మనీతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే జర్మన్ కంపెనీలకు ప్రభుత్వం తరఫున ‘రెడ్ కార్పెట్’ పరిచి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఏర్పాటు చేయబోయే ‘స్కిల్ యూనివర్సిటీ’లో ప్రత్యేకంగా ‘జర్మన్ లాంగ్వేజ్’ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భట్టి ప్రకటించారు. దీనిద్వారా తెలంగాణ విద్యార్థులు జర్మన్ భాషపై పట్టు సాధించి, విదేశాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలను పొందేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం గురించి జర్మన్ బృందానికి మంత్రులు వివరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ ఆధునిక నగర అభివృద్ధిలో జర్మనీ భాగస్వామ్యం కూడా ఉండాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను జర్మన్ ఎంపీల బృందం ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతను వారు కొనియాడారు. భవిష్యత్తులో సైబర్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఇరువర్గాల మధ్య సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి జరగాలని జర్మన్ బృందం సూచించింది.