మహిళా ప్రయాణికులకు శుభవార్త.
* రాబోతున్న ‘స్మార్ట్’ సొల్యూషన్.
* టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ అడుగు.
* 2026 ఆరంభంలో మహిళలకు, విద్యార్థులకు కొత్త స్మార్ట్ కార్డులు
* బస్ పాస్ స్థానంలో హైటెక్ స్మార్ట్ కార్డులు
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మహిళా ప్రయాణికుల కోసం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సరళీకృతం చేసేందుకు సంస్థ నడుం బిగించింది. మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొంటున్న చిన్నపాటి ఇబ్బందులను తొలగించి, వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ, 2026 నూతన సంవత్సరం ప్రారంభంలో ఈ స్మార్ట్ కార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు గట్టిగా నిర్ణయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించాల్సి వస్తోంది. నిత్యం ప్రయాణించే వారికి లేదా హడావిడిలో ఆధార్ కార్డును మరిచిపోయిన వారికి ఇది కొంత అసౌకర్యంగా మారింది. గుర్తింపు కార్డు లేకపోతే టికెట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ ఈ స్మార్ట్ కార్డుల విధానానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలో మహిళల కోసం విజయవంతంగా అమలవుతున్న ‘సహేలీ’ కార్డుల స్ఫూర్తితో ఈ కార్డులను రూపొందిస్తున్నారు. ఈ కొత్త స్మార్ట్ కార్డుపై లబ్ధిదారుని ఫోటో, పేరు, చిరునామా వంటి పూర్తి వివరాలు ముద్రించి ఉంటాయి. దీనివల్ల ప్రతిసారీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు, కేవలం ఈ ఒక్క కార్డు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఈ వినూత్న స్మార్ట్ కార్డు సేవలు కేవలం మహిళలకే పరిమితం కాకుండా, విద్యార్థులు మరియు ఇతర రాయితీ పాస్‌లు కలిగిన వారికి కూడా వర్తింపజేయాలని ఆర్టీసీ భావిస్తోంది. విద్యార్థుల బస్ పాస్‌లను కూడా ఈ స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చనున్నారు. రాబోయే కొత్త విద్యా సంవత్సరం నుండి హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా విద్యార్థులకు ఈ కార్డులను జారీ చేసి, ఫలితాలను బట్టి దశలవారీగా రాష్ట్రం మొత్తం విస్తరించే యోచనలో అధికారులు ఉన్నారు. దీనివల్ల పాస్‌ల జారీ ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా, కండక్టర్లకు తనిఖీ చేయడం కూడా సులభమవుతుంది.
మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నాటి నుండి మహిళల ప్రయాణాలు రికార్డు స్థాయిలో పెరిగాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, దీని విలువ సుమారు రూ.8,500 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. ఇంతటి భారీ స్పందన ఉన్న ఈ పథకంలో స్మార్ట్ కార్డుల ప్రవేశం ఒక విప్లవాత్మక మార్పు కానుంది. ఈ కొత్త విధానం ద్వారా బస్సు ఎక్కే సమయం ఆదా అవ్వడమే కాకుండా, డిజిటల్ రికార్డుల నిర్వహణ కూడా ఆర్టీసీకి సులభతరం అవుతుందని భావిస్తున్నారు.








