Mahaa Daily Exclusive

  డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం…

Share

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం..
* రౌడీ షీటర్లలాగే పెడ్లర్లపై నిఘా: సీపీ సజ్జనార్.

హైదరాబాద్, మహా.

మహానగరంలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు. డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో డ్రగ్స్ నియంత్రణ చర్యలపై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో (ఐబీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మత్తు మహమ్మారిని ఏరిపారేసేందుకు పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లపై పోలీసులు ఎలాంటి ప్రత్యేక నిఘా ఉంచుతారో, ఇకపై డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపైనా అదే స్థాయి నిఘా పెడుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పాత నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే, కొత్తగా ఈ రొంపిలోకి దిగుతున్న వారిపై డేగ కన్ను వేస్తామని హెచ్చరించారు.
నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పటికే పనిచేస్తున్న ‘హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌’ (హెచ్-న్యూ)ను మరింత బలోపేతం చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనంగా మరో నాలుగైదు కొత్త ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని, ఇది సమాజం కోసం చేసే నిరంతర పోరాటమని ఆయన పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత హైదరాబాద్‌గా మార్చే క్రమంలో అన్ని దర్యాప్తు విభాగాలు, ఏజెన్సీలు పరస్పర సహకారంతో, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.

Latest