Mahaa Daily Exclusive

  రాహుల్ గాంధీ ఇంటికీ తెలంగాణ బీజేపీ ఎంపీ..!

Share

దేశ రాజధానిలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మెదక్ లోక్‌సభ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు.. కొద్దిసేపటి కిందటే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌కు చెందిన రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట ఇద్దరు ముగ్గురు మాత్రమే అనుచరులు ఉన్నారు.

 

ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అధికారిక నివాసం నంబర్ 12, తుగ్లక్ లేన్‌లో నివాసం ఉంటోన్నారు రాహుల్ గాంధీ. కొద్దిసేపటి కిందట రఘునందన్ రావు ఆ బంగళాకు వెళ్లారు. తన వెంట బ్లిట్జ్ మేగజైన్ కాపీలను తీసుకెళ్లారు.

 

తొలుత గేట్ వద్ద ఆయనను భద్రత సిబ్బంది ప్రశ్నించారు. వచ్చిన కారణాలను అడిగి తెలుసుకున్న తరువాత లోనికి పంపించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ.. పార్టీ నాయకులతో సమావేశంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలతో ఏర్పాటు చేసిన భేటీలో పాల్గొన్నారు.

 

రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం వల్ల బ్లిట్జ్ మేగజైన్ కాపీలను అక్కడి రిసెప్షన్ సిబ్బందికి అప్పగించి బయటికొచ్చారు. రాహుల్‌కు బేకన్, బీఫ్ అంటే చాలా ఇష్టమని, ఆయన ఆహార, జీవనశైలి పూర్తిగా హిందూమతానికి భిన్నమైనదంటూ బ్లిట్జ్ మేగజైన్ కొద్దిరోజుల కిందటే ప్రచురించింది. రాహుల్ హిందూ కుటుంబానికి చెందినవాడని తాము భావించలేదంటూ ఆయన స్నేహితుడిని ఉటంకిస్తూ ఓ కథనాన్ని రాసింది.

 

దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రఘునందన్ రావు.. నేరుగా రాహుల్ ఇంటికి వెళ్లారు. ఇందులో వచ్చిన కథనాలకు ఏ సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎవరూ దీని గురించి మాట్లాడలేదని, అందుకే తాను నేరుగా రాహుల్‌ను కలిసి వివరణ తీసుకోవడానికి వచ్చానని చెప్పారు.

Latest