- బ్యాంకు సొమ్ము కాజేసిన దొంగలు దర్జాగా ఉన్నారు…
- సంబంధం లేని గ్రూప్ సభ్యులకు నోటీసులు
- స్వరాజ్ గ్రూప్ సభ్యులకు బ్యాంకు నోటీసులు
- పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న సభ్యులు
కారేపల్లి, మహా:బ్యాంకు లింకేజీ రుణం పేరుతో అక్రమంగా బ్యాంకు సొమ్మును కాజేసిన దొంగలు దర్జాగా తిరుగుతున్నారు… ఆరుణంతో ఏ మాత్రం సంబంధం లేని గ్రూప్ సభ్యులైన మహిళలకు బ్యాంకు నోటీసులు పంపించి వారిని మానసిక ఆందోళనకు గురి చేసేలా వ్యవహరించిన బ్యాంక్ అధికారులు తీరుపై మహిళలు మండిపడుతున్నారు. మోట్లగూడెం గ్రామానికి చెందిన ఐకెపి అక్రమాన్ని మహా వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చినా అధికారులు మాత్రం అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కారేపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి స్వరాజ్ గ్రూపుకు సంబంధించిన సభ్యులకు మంగళవారం నోటీసులు పోస్ట్ ద్వారా వచ్చాయి. ఆ నోటీసుల్లో బ్యాంకుకు బకాయి పడ్డ రూ .4.50లక్షల రూపాయల సొమ్మును చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
*గ్రామానికి సంబంధం లేని ముగ్గురి పేర్లతో…
స్వరాజ్ గ్రూపులో గ్రామానికి సంబంధం లేని ముగ్గురు మహిళలను గ్రూపులో చేర్చి నిబంధనలకు విరుద్ధంగా ఆ ముగ్గురి పేర్లతో బ్యాంకు లింకేజీ రుణం తీసుకుని అప్పటి బుక్ కీపర్, గ్రామ దీపిక, సీసీ, బ్యాంక్ మేనేజర్ కలసి కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూపులో ఉన్న మిగతా పదిమంది సభ్యులు మేము రుణం కోసం బ్యాంకు లోకే వెళ్లలేదు బ్యాంక్ అధికారులు చెప్పే ఆ లోన్ కు మాకు సంబంధం లేదని మహిళలంతా మొత్తుకుంటున్నా వారి గోడు వినిపించుకోవడం లేదు.
*అక్రమంగా లోన్ మంజూరు చేసిన బ్యాంకు మేనేజర్ పై చర్యలు ఏవీ..?
నిబంధనలకు విరుద్ధంగా మోట్లగూడెం గ్రామానికి ఏ మాత్రం సంబంధం లేని ముగ్గురి పేర్లతో అక్రమంగా లోన్ మంజూరు చేసిన అప్పటి బ్యాంక్ అధికారి పై గ్రామీణ బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా లోన్ తో సంబంధం లేని సభ్యులకు నోటీసులు పంపడమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ సభ్యులు అందరూ బ్యాంకుకు రాకుండా బ్యాంకు లింకేజీ లోన్ ఎలా మంజూరి చేశారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు సొమ్ము ను ఉద్దేశపూర్వకంగా కాజేసిన వ్యక్తులను అధికారులు కాపాడే ప్రయత్నం చేయడమేంటని, అక్రమం జరిగిందని తేటతెల్లమైనా చేతులు దులుపుకునే పనులు ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
*పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు…
అక్రమంగా బ్యాంకు లింకేజీ రుణం పొంది చీటింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రూప్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.. బ్యాంక్ అధికారులు, ఐకెపి అధికారులు వారి సిబ్బందిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీస్ అధికారులు విచారణ చేపడితేనే అక్రమార్కులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.








