హైదరాబాద్, మహా
డీసీసీ అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. శిబిరం ముగింపు కార్యక్రమంలో మహేష్ గౌడ్ చేసిన కృషిని ప్రశంసిస్తూ “వెల్ డన్ మహేష్” అంటూ కితాబు ఇవ్వడంతో సభలో చప్పట్ల వర్షం కురిసింది. డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహణలో మహేష్ గౌడ్ స్వయంగా పాల్గొని, పది రోజుల పాటు అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తూ దగ్గరుండి పర్యవేక్షించిన విధానం పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపింది. శిబిరం ప్రతి రోజు కార్యక్రమాల రూపకల్పన నుంచి అమలు వరకు ఆయన చూపిన పట్టుదల, క్రమశిక్షణ నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ముగింపు కార్యక్రమం సందర్భంగా “సంఘటన సృజన్” ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ మాట్లాడుతూ, మహేష్ పది రోజుల పాటు పూర్తిగా శిబిరానికి హాజరై ప్రతి సెషన్‌ను సమర్థంగా నిర్వహించారు” అని ప్రశంసించారు. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ “వెల్ డన్ మహేష్” అంటూ అభినందించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో నిర్వహించిన ఈ శిక్షణ శిబిరం పార్టీకి నూతన ఉత్సాహాన్ని అందించగా, రాహుల్ గాంధీ ప్రశంసలు ఆయన కృషికి మరింత గుర్తింపుగా నిలిచాయి.








