- యువతిని ముక్కలు ముక్కలుగా నరికిన కిరాతకుడు!
- పరువు పోతుందనే భయంతోనే ‘మౌనిక’ హత్య.. నిందితుడు రవీంద్ర విస్తుపోయే వాంగ్మూలం.
- ముందస్తు పథకం ప్రకారమే దారుణం..ఆన్‌లైన్‌లో కత్తులు ఆర్డర్ ఇచ్చి మరీ వేట!
విశాఖపట్నం,మహా.
మహానగరం విశాఖపట్నంలో అత్యంత కిరాతకమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. పరువు ప్రతిష్టలు, ఉద్యోగం పోతుందన్న భయంతో ఓ యువకుడు రాక్షసుడిగా మారి, ఒక యువతిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపింది. మౌనిక అనే యువతి హత్య కేసులో పోలీసులు జరిపిన విచారణలో నిందితుడు రవీంద్ర వెల్లడించిన నిజాలు వింటుంటే సభ్య సమాజం నివ్వెరపోతోంది. కేవలం ఒక ఐడీ కార్డు చుట్టూ తిరిగిన వివాదం, చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసే స్థాయికి వెళ్లడం నిందితుడిలోని క్రూరత్వాన్ని చాటిచెబుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు రవీంద్రకు, మౌనికకు మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే రవీంద్రకు సంబంధించిన ఆఫీస్ ఐడీ కార్డును మౌనిక లాగేసుకుంది. ఆ కార్డును తిరిగి ఇవ్వకుండా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, అతని ఉద్యోగం పోయేలా చేస్తానని ఆమె పదేపదే హెచ్చరించింది. అంతటితో ఆగకుండా, సమాజంలో అతని పరువు తీస్తానని బెదిరించడం రవీంద్రలో తీవ్ర ఆందోళనను నింపింది. తన కెరీర్ నాశనమవుతుందన్న భయం, పరువు పోతుందన్న ఆవేదన అతనిని పథకం ప్రకారం హత్య చేసేలా ప్రేరేపించాయి. ఈ క్రమంలోనే ఎవరికీ అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో కత్తితో పాటు మృతదేహాన్ని ముక్కలు చేయడానికి అవసరమైన పరికరాలను ముందుగానే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాడు.
నేరం చేయడానికి రవీంద్ర ఒక సమయం కోసం వేచి చూశాడు. తన భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయాన్ని అదునుగా తీసుకున్న నిందితుడు, మౌనికను తన ఇంటికి పిలిపించాడు. అక్కడ ఆమెతో సానుకూలంగా మాట్లాడి, ఐడీ కార్డు ఇచ్చేయాలని, తన జీవితంతో ఆడుకోవద్దని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయితే, మౌనిక అందుకు అంగీకరించకపోవడంతో పాటు తన పంతాన్ని వీడలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర, తాను ముందుగా సిద్ధం చేసుకున్న ఆయుధాలతో ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు, ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేయాలని ప్రయత్నించడం గమనార్హం.
ఈ భయంకరమైన కృత్యం చేసిన తర్వాత రవీంద్ర తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. జరిగిన విషయాన్ని తన స్నేహితుడు సందీప్‌కు వివరించాడు. అయితే, ఆ స్నేహితుడు నిందితుడికి సహకరించకుండా, తక్షణమే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా, తన ఉద్యోగం పోతుందన్న భయంతోనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. క్షుణ్ణంగా ప్లాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఆయుధాలు కొనుగోలు చేయడం చూస్తుంటే, ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదని, పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణమని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు.








