Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌ ఆకాశరేఖలో మరో అద్భుతం..! 800 అడుగుల ఎత్తులో 65 అంతస్తుల జంట టవర్లు..

Share

  • కొకాపేటలో ‘ట్రంప్‌ టవర్స్‌’.
  • రూ.3,500 కోట్ల అమ్మకాల అంచనా.
  •  800 అడుగుల ఎత్తులో 65 అంతస్తుల జంట టవర్లు.

హైదరాబాద్‌, మహా:

అంతర్జాతీయ నగరాల సరసన హైదరాబాద్‌ లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వేగంగా ఎదుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ట్రంప్‌’ బ్రాండ్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టబోతోంది. నగరంలోని కొకాపేట గోల్డెన్‌ మైల్‌ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ‘ట్రంప్‌ టవర్స్‌ హైదరాబాద్‌’ రూపుదిద్దుకోనుంది. దక్షిణ భారతదేశంలో తొలి ట్రంప్‌ బ్రాండెడ్‌ లగ్జరీ నివాస ప్రాజెక్టుగా నిలవనున్న ఈ నిర్మాణం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది.

ట్రంప్‌ బ్రాండ్‌కు భారత్‌లో అధికారిక భాగస్వామిగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌, స్థానిక ఇరా రియల్టీతో కలిసి ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ వద్ద పీ02400010871 నమోదు సంఖ్యతో ‘ఇరా ది ఎడ్జ్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో ప్రాజెక్టు నమోదైంది. కొకాపేట గోల్డెన్‌ మైల్‌ ప్రాంతంలో 16,389.76 చదరపు మీటర్ల స్థలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఆమోదిత నిర్మాణ విస్తీర్ణం 2,64,580 చదరపు మీటర్లు. ప్రాజెక్టు పూర్తి గడువును 2031 మే 15గా ఆర్‌ఈఆర్‌ఏ నమోదు వివరాల్లో పేర్కొన్నారు.

**800 అడుగుల ఎత్తు.. 65 అంతస్తుల జంట టవర్లు**

ఈ ప్రాజెక్టులో సుమారు 800 అడుగుల ఎత్తుతో రెండు 65 అంతస్తుల టవర్లు నిర్మించనున్నట్లు డెవలపర్లు వెల్లడించారు. మొత్తం సుమారు 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతమైన నివాస సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టులోని రెండు టవర్లను 28వ అంతస్తు వద్ద ఆకాశంలో ప్రత్యేకమైన సస్పెండెడ్‌ స్కై బ్రిడ్జ్‌తో అనుసంధానించనున్నారు. ఈ స్కై బ్రిడ్జ్‌పై ప్రత్యేకంగా ‘ట్రంప్‌ క్లబ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని నలువైపులా కనిపించేలా ఓపెన్‌ ల్యాండ్‌స్కేప్డ్‌ క్లబ్‌ ఫ్లోర్‌గా దీనిని తీర్చిదిద్దనున్నారు.

ఆకాశంలో రెండు భారీ టవర్లను కలుపుతూ స్కై బ్రిడ్జ్‌ నిర్మించడం సాధారణ నిర్మాణంతో పోలిస్తే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ.. ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ డిజైన్‌ను ఎంచుకున్నట్లు ట్రైబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేష్‌ మెహతా వెల్లడించారు.

**రూ.1,700–1,800 కోట్ల పెట్టుబడి.. రూ.4,200 కోట్ల వరకు అమ్మకాల అంచనా**

భూమి వ్యయాన్ని మినహాయించి ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కల్పేష్‌ మెహతా తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం భూమి విలువ సుమారు రూ.250 కోట్లుగా అంచనా వేశారు.

ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మొత్తం అమ్మకాల విలువ రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల మధ్య ఉండొచ్చని పేర్కొన్నారు. ఒక అపార్ట్‌మెంట్‌ ధర సుమారు రూ.5 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇప్పటికే ప్రాజెక్టుకు మంచి స్పందన లభించిందని డెవలపర్లు చెబుతున్నారు. అధికారిక విక్రయాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యే ముందే ప్రాధాన్యత కేటాయింపుల కోసం ఆసక్తి వ్యక్తీకరణలను ఆహ్వానించారు. ఇప్పటికే ఎనిమిది పెంట్‌హౌస్‌లు సుమారు రూ.250 కోట్ల విలువకు విక్రయమైనట్లు కల్పేష్‌ మెహతా తెలిపారు. వీటిలో ఒక పెంట్‌హౌస్‌ ఏకంగా రూ.62 కోట్లకు విక్రయమైనట్లు వెల్లడించారు.

**450కి పైగా అత్యంత విలాసవంతమైన నివాసాలు**

ప్రాజెక్టులో 450కి పైగా నివాస యూనిట్లు ఉండనున్నాయి. 3.5, 4 బీహెచ్‌కే గృహాలతో పాటు డబుల్‌-హైట్‌ సింప్లెక్స్‌ నివాసాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఇంటికి ప్రత్యేకమైన ప్రైవేట్‌ లిఫ్ట్‌ లాబీ, నేల నుంచి పైకప్పు వరకు విస్తరించే గాజు కిటికీలు వంటి సదుపాయాలు కల్పించనున్నారు.

ల్యాండ్‌స్కేప్డ్‌ పోడియంపై క్లబ్‌, వినోదం, ఆరోగ్యం, విశ్రాంతికి సంబంధించిన అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. సాధారణ అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టులకు భిన్నంగా అత్యంత విలాసవంతమైన జీవనశైలిని అందించడమే లక్ష్యంగా నిర్మాణ రూపకల్పన సాగుతోంది.

**‘హైదరాబాద్‌కు ట్రంప్‌ బ్రాండ్‌ తీసుకురావడం ఆనందంగా ఉంది’**

ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ ట్రంప్‌ హైదరాబాద్‌ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా స్పందించారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ట్రంప్‌ బ్రాండ్‌ను తొలిసారిగా హైదరాబాద్‌కు తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ట్రైబెకాతో మరోసారి కలిసి పనిచేయడం ఉత్సాహంగా ఉందని, హైదరాబాద్‌ దేశంలోని అత్యంత చైతన్యవంతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటని ఎరిక్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ టవర్స్‌ హైదరాబాద్‌ నగరంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

**‘హైదరాబాద్‌కు ఇప్పటివరకు ట్రంప్‌ అడ్రస్‌ లేదు’**

ట్రైబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేష్‌ మెహతా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ దేశంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో ఒకటని అన్నారు. దేశంలోని ఇతర నగరాల్లో ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠాత్మక చిరునామాలుగా మారాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఇప్పటివరకు ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాజెక్టు లేకపోవడంతో నగరానికి అత్యుత్తమమైన ట్రంప్‌ టవర్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. రెండు టవర్లను ఆకాశంలో స్కై బ్రిడ్జ్‌తో అనుసంధానించడం ద్వారా ప్రాజెక్టుకు ప్రత్యేకత తీసుకురావాలని భావించినట్లు వివరించారు.

**ట్రంప్‌ పెట్టుబడి కాదు.. బ్రాండ్‌ భాగస్వామ్యంతో ప్రాజెక్టు**

ఈ ప్రాజెక్టు విషయంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగతంగా హైదరాబాద్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారని భావించడం సరికాదు. భారత్‌లో ట్రంప్‌ బ్రాండ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు స్థానిక డెవలపర్లతో భాగస్వామ్యం, బ్రాండ్‌ లైసెన్సింగ్‌ విధానంలో అభివృద్ధి అవుతున్నాయి. ట్రైబెకా డెవలపర్స్‌ ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

**12 ఏళ్లుగా భారత్‌లో ట్రంప్‌ బ్రాండ్‌ ప్రస్థానం**

భారత్‌లో ట్రంప్‌ బ్రాండెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల ప్రస్థానం ఇప్పటికే 12 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ప్రస్తుతం ముంబై, పుణే, గురుగ్రామ్‌, కోల్‌కతా వంటి నగరాల్లో ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే, గురుగ్రామ్‌ తదితర నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేసే ప్రణాళికలను ట్రైబెకా గతంలో ప్రకటించింది.

**కొకాపేట.. లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌కు కొత్త చిరునామా**

ట్రంప్‌ టవర్స్‌ కోసం కొకాపేట గోల్డెన్‌ మైల్‌ ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండటం, భారీ మౌలిక వసతుల అభివృద్ధి, అధిక ఆదాయ వర్గాల నివాస డిమాండ్‌ కారణంగా కొకాపేట–నియోపొలిస్‌ ప్రాంతం హైదరాబాద్‌ అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లలో ఒకటిగా ఎదుగుతోంది.

ఇప్పటికే ఈ ప్రాంతంలో అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్‌ విల్లాలు, హై-రైజ్‌ నివాస ప్రాజెక్టులకు భారీ డిమాండ్‌ కనిపిస్తోంది. కొకాపేటలోని ట్రంప్‌ టవర్స్‌ రాకతో ఈ ప్రాంతానికి అంతర్జాతీయ బ్రాండ్‌ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

**ధరలు రూ.5 కోట్ల నుంచి.. లగ్జరీ మార్కెట్‌ మరింత వేడెక్కే అవకాశం**

హైదరాబాద్‌లో అధిక విలువ కలిగిన గృహాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ టవర్స్‌ వంటి అంతర్జాతీయ బ్రాండెడ్‌ ప్రాజెక్టులు కొత్త స్థాయి పోటీని తీసుకురానున్నాయి. కొకాపేట, నియోపొలిస్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, జూబ్లీహిల్స్‌ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే అత్యంత ఖరీదైన నివాస ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.

ట్రంప్‌ టవర్స్‌ ప్రాజెక్టులో ఒక నివాస యూనిట్‌ ధర రూ.5 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని డెవలపర్లు చెబుతున్న నేపథ్యంలో.. అత్యంత విలాసవంతమైన గృహాల మార్కెట్‌లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన పెంట్‌హౌస్‌లకు వచ్చిన స్పందన ఈ విభాగంలో కొనుగోలుదారుల ఆసక్తిని సూచిస్తోంది.

**2031లో హైదరాబాద్‌ ఆకాశరేఖలో కొత్త ల్యాండ్‌మార్క్‌**

ఆర్‌ఈఆర్‌ఏ నమోదు ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం 2031 మే 15 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. రెండు 65 అంతస్తుల టవర్లు, ఆకాశంలో స్కై బ్రిడ్జ్‌, ప్రత్యేక ట్రంప్‌ క్లబ్‌, వందలాది అత్యంత విలాసవంతమైన నివాసాలు.. ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌ ఆకాశరేఖలో ప్రత్యేకమైన నిర్మాణంగా నిలబెట్టే అవకాశం ఉంది.

అంతర్జాతీయ ఐటీ, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి లగ్జరీ బ్రాండ్‌ రావడం నగర ప్రతిష్ఠను మరింత పెంచనుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొకాపేట గోల్డెన్‌ మైల్‌లో నిర్మితమయ్యే ఈ జంట టవర్లు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని అల్ట్రా-లగ్జరీ జీవనశైలికి కొత్త నిర్వచనం ఇచ్చే అవకాశముంది.

Latest