- ఆర్టీసీ ప్రైవేటీకరణకు సీఎం పావులు.
- థామస్ రెడ్డి
- రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల నిరసన జ్వాలలు.
- మంత్రి పొన్నం రాజీనామాకు డిమాండ్.
కరీంనగర్, మహా.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)ని ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెర వెనుక పావులు కదుపుతున్నారని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ డిపోల్లో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అనుమతించవద్దని, సంస్థ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కరీంనగర్ డిపో-2 ఎదుట నిర్వహించిన ‘అర్ధనగ్న ప్రదర్శన’లో పాల్గొన్న థామస్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌లో అన్ని శాఖలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం, లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీని మాత్రం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు రావాల్సిన రూ. 7,500 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే కేటాయించడం కార్మికులను వంచించడమేనని మండిపడ్డారు. సంస్థ ప్రయోజనాలను కాపాడటంలోనూ, నిధులు రాబట్టడంలోనూ విఫలమైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర నిధులతో కొనుగోలు చేసిన ఎలక్ట్రా, జేబీఎం కంపెనీల ఈవీ బస్సులను ఆర్టీసీకి అప్పగించి, వాటి ద్వారా వచ్చే లాభాలను మాత్రం ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని థామస్ రెడ్డి విమర్శించారు. ఈవీ బస్సుల నిర్వహణను పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యానికే అప్పగించాలని, ఆర్టీసీ స్థలాల్లో కేవలం సంస్థ బస్సులే ఉండాలని, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, యూనియన్లకు గుర్తింపునిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. అధికారంలోకి వచ్చాక కేంద్రం చెప్పినట్లు ప్రైవేటీకరణ నిర్ణయాలను రాష్ట్రంలో అమలు చేయడానికి ముఖ్యమంత్రే స్వయంగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.








