- బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ
- మమతకు బిగ్ షాక్
- కౌంటింగ్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- కౌంటంగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రక్రియ పూర్తి అధఇకారం ఈసీదేనని స్పష్టం
కోలకత్తా, మహా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ, అధికార తృణమూల్ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, పీఎస్‌యూ సిబ్బందిని కౌంటింగ్ సూపర్వైజర్లుగా నియమించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. శనివారం జరిగిన విచారణలో ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ చట్టబద్ధమేనని కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జైమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక అంశంపై విచారణ చేపట్టింది. కౌంటింగ్ సిబ్బందిని ఎంపిక చేసే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
“కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే కౌంటింగ్ సిబ్బందిగా ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఆ సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మేము భావించడం లేదు” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటింగ్ ప్రక్రియలో కేవలం కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే వినియోగించడం “ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్” (దామాషా ప్రాతినిధ్యం) సూత్రానికి విరుద్ధమని టీఎంసీ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ వాదించారు. అయితే, సిబ్బంది ఎవరైనా వారు ప్రభుత్వ ఉద్యోగులేనని, వారి నియామకంలో ఈ వివక్ష చూపడం సరికాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
టీఎంసీ వాదనలో వైరుధ్యంపై అసహనం
విచారణ సందర్భంగా ధర్మాసనం టీఎంసీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టింది. ఒకవైపు ఎన్నికల సంఘం సర్క్యులర్‌ను సవాల్ చేస్తూనే, మరోవైపు అదే సర్క్యులర్‌ను కచ్చితంగా అమలు చేయాలని కోరడం ఏంటని జస్టిస్ బాగ్చీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని టీఎంసీ కోరగా, ఈ విషయంలో ఈసీ ప్రతినిధి ఇచ్చిన హామీని కోర్టు రికార్డు చేసింది. “ఏప్రిల్ 13న జారీ చేసిన సర్క్యులర్‌ను అక్షరాలా అమలు చేస్తాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యం కూడా ఉంటుంది” అని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయేమోనన్న టీఎంసీ ఆందోళనలను కోర్టు కొట్టిపారేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లు ఉంటారు కాబట్టి పారదర్శకతకు ఎలాంటి ముప్పు ఉండదని భరోసా ఇచ్చింది. “కౌంటింగ్ సమయంలో టీఎంసీ ప్రతినిధులు అక్కడే ఉంటారు. ప్రక్రియ అంతా వారి సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా, కౌంటింగ్ ప్రక్రియకు సారథ్యం వహించే ‘రిటర్నింగ్ ఆఫీసర్’ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగేనని, కాబట్టి ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతాయని భావించడం సరికాదని ఎన్నికల సంఘం వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో అదనపు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ కేసును ముగించింది.







