Mahaa Daily Exclusive

  ఎక్సైజ్ సిబ్బందికి స్వంత జిల్లా నిబంధన వద్దు.. సీఎంకు జగ్గారెడ్డి బహిరంగ విజ్ఞప్తి..

Share

• కానిస్టేబుళ్ల బదిలీల్లో ‘8( ఎఫ్)’ క్లాజ్ తొలగించండి.

• సీఎంకు జగ్గారెడ్డి బహిరంగ విజ్ఞప్తి.

హైదరాబాద్, మహా.

అబ్కారీ శాఖలో కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. స్వంత జిల్లాల్లో పనిచేయకూడదన్న నిబంధన వల్ల వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల క్రితం విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ బదిలీ నిబంధనల్లోని ‘క్లాజ్ 8 (ఎఫ్)’ను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు తమ స్వంత జిల్లాల్లో పనిచేయడానికి వీలు లేదని పేర్కొనడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కింది స్థాయి ఉద్యోగులకు ఇలాంటి కఠిన నిబంధనలు విధించడం వల్ల వారి వ్యక్తిగత జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేవలం సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 150 మంది కానిస్టేబుళ్ల కుటుంబాలు ఈ నిర్ణయంతో ఆందోళనలో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3,000 కుటుంబాలపై ఈ ప్రభావం పడుతుందని వివరించారు. ముఖ్యంగా మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయనున్న హెడ్ కానిస్టేబుళ్లకు ఈ నిబంధన తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పైబడిన తరుణంలో కుటుంబాలకు దూరంగా వెళ్లి పనిచేయడం వారికి భారంగా మారుతుందని, అలాగే వారి పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎక్సైజ్ సిబ్బంది తనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, కానీ ఈ నిబంధన వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారని తెలిపారు. సమయాభావం ఉన్నందున, బదిలీల ప్రక్రియ ముగిసేలోపే ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి నిబంధనను ఎత్తివేయాలని ఆయన కోరారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బదిలీలు చేపట్టాలని, మానవతా దృక్పథంతో పునరాలోచించి ఆ నిబంధనను తొలగించాలని ముఖ్యమంత్రికి, ఎక్సైజ్ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.