- వంద సీట్లతో మళ్లీ మనమే.
- బావ-బామ్మర్దుల పోరులో గులాబీ పార్టీ కకావికలం.
- దేవుడి పేరుతో బీజేపీ డ్రామాలు సాగవు..
- ఫామ్‌హౌస్‌కే కేసీఆర్ పరిమితం.
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ గడ్డపై బీఆర్‌ఎస్ పార్టీ తన రాజకీయ అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఆ పార్టీ పతనం ముగింపు దశకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అచంచలమైన విశ్వాసం ఉంచారని, ఇటీవల జరిగిన పలు ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్, బీజేపీలు అపవిత్ర పొత్తులతో విషం చిమ్ముతున్నాయని ఆయన మండిపడ్డారు.
గులాబీ దళంలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత ముసలంపై మహేశ్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ కవిత పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని, ‘వేరు కుంపటి’ రాజేయడంతో బీఆర్‌ఎస్ పరిస్థితి రోడ్డున పడిందని ఎద్దేవా చేశారు. పార్టీలో క్రమశిక్షణ కరువైందని, ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కేడర్ అంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోందని విశ్లేషించారు. ఒకప్పుడు అధికారమనే మదంతో విర్రవీగిన నాయకులు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారని దుయ్యబట్టారు. పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయాలకు దాదాపు స్వస్తి పలికి కేవలం తన ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం ఆ పార్టీ అస్తమయానికి స్పష్టమైన సంకేతమని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్న నాయకులను ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఆయన హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ తీరును కూడా ఆయన నిశితంగా విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పి, మతపరమైన సెంటిమెంట్లతో ఓట్లు రాబట్టుకోవాలని చూడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. తెలంగాణ వంటి లౌకిక రాష్ట్రంలో మత రాజకీయాలకు తావు లేదని, అభివృద్ధిని విస్మరించి కేవలం విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైన బీజేపీ నేతలు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ఆయన ప్రశ్నించారు. దేవుడిని గుడిలో చూడాలి కానీ ఓట్ల పెట్టెలో వెతకడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువవుతున్నాయని మహేశ్ గౌడ్ వెల్లడించారు. రైతుల రుణమాఫీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరకు ప్రతి పథకం విజయవంతంగా అమలువుతోందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను చూస్తుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదని ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే, ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. విపక్షాల అడ్రస్ గల్లంతు కావడం తథ్యం. రాబోయే ఎన్నికల్లో మాకు వందకు పైగా సీట్లు రావడం నల్లేరు మీద నడకే” అని ఆయన జోస్యం చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడకుండా విపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలని, ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.








