- ఐఏఎస్ అధికారిణి కుమారుడికి పాజిటివ్!
- కొండాపూర్ ‘క్వాక్ ఎరీనా’లో డ్రగ్స్ పార్టీ.
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తల అరెస్ట్.
- ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, మహా.
నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో గల కొండాపూర్‌లోని ‘క్వాక్ ఎరీనా’ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో ఎనిమిది మంది యువకులు మాదక ద్రవ్యాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. ఈ ఎనిమిది మందిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిణి కుమారుడు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఉన్నత విద్యావంతులు, సమాజంలో పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన యువకులు ఇలా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకోవడం నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పోలీసుల కథనం ప్రకారం, కొండాపూర్‌లోని సదరు పబ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో వ్యాపారవేత్తలుగా ఉన్న మోనిష్ ఉమేష్, రిషబ్, కాంట్రాక్టర్ పృథ్వీరాజ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న అభిషేక్, హరిత్‌లు ఉన్నారు. వీరితో పాటు ఉబెర్ సంస్థలో అనలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రిత్విక్, మొబైల్ షాపు యజమాని రితేష్, , జ్యోతిరాదిత్య అనే యువకుడు పోలీసులకు చిక్కారు. వీరిలో జ్యోతిరాదిత్య ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారిణి కుమారుడని, ఆయన ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారని తెలుస్తోంది.
డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిన వారందరిపై పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు. పబ్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయి? వీటిని సరఫరా చేస్తున్న ముఠా ఎక్కడ ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పబ్ నిర్వాహకుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. నగరంలో డ్రగ్స్ రహిత వాతావరణం కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విశ్లేషకులు వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యసనాలకు బానిస కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








