- ఆధునిక వేగంలో భద్రతను మరువకండి.
- ప్రతి నిర్మాణానికి ‘జియోటెక్నికల్’ పరీక్షే రక్ష
- మున్సిపాలిటీల్లో ప్రత్యేక విభాగాలు ఉండాలి.
- నిర్మాణ రంగ నిపుణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి
- ఎన్. రాంచందర్ రావు పిలుపు.
హైదరాబాద్, మహా.
నగరంలో ఆకాశహర్మ్యాలు పేకమేడల్లా కూలిపోకుండా ఉండాలంటే ప్రతి నిర్మాణానికి ముందు నేల స్వభావాన్ని పరీక్షించడం (జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్) అనివార్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌లో నిర్వహించిన “ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ & రికమెండేషన్స్” సాంకేతిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గతంలో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక ప్రముఖ భవన ప్రమాదాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, ఆ చేదు అనుభవం తర్వాతే సైట్ టెస్టింగ్‌ను ప్రభుత్వం నిబంధనగా మార్చిందని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు కూడా ఈ రంగంలో నిష్ణాతులు కావడంతో, భూమి అంతర్గత బలాన్ని అంచనా వేయడం నిర్మాణ భద్రతకు ఎంత కీలకమో తనకు స్వయంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కాలంలో సైన్స్, టెక్నాలజీ విప్లవాత్మక మార్పులకు లోనవుతున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని రెండేళ్లు పట్టే భారీ నిర్మాణాలు ఇప్పుడు కేవలం ఆరు నెలల్లోనే పూర్తవుతున్నాయని రాంచందర్ రావు విశ్లేషించారు. అయితే, ఈ వేగంలో నాణ్యతను, భూసంబంధిత పరిశీలనలను విస్మరించడం ప్రమాదకరమని హెచ్చరించారు. భూమి ఎంత బరువును తట్టుకోగలదు? నేల లోపల ఏముంది? అనే ప్రాథమిక అంశాలను శాస్త్రీయంగా పరిశీలించకుండా కట్టడాలు నిర్మిస్తే అవి దీర్ఘకాలం మనుగడ సాగించలేవని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ సంస్థలు కేవలం అనుమతులకు పరిమితం కాకుండా, జియోటెక్నికల్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అప్పుడే భవనాల ఆయుష్షు పెరగడంతో పాటు ప్రజల ప్రాణాలకు భరోసా లభిస్తుందని నొక్కి చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను ప్రస్తావిస్తూ.. కరోనా తర్వాత మనం డిజిటల్ విప్లవానికి ఎలా అలవాటు పడ్డామో, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు కూడా నిర్మాణ రంగంలో మార్పులను కోరుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. క్షిపణి దాడులను సైతం తట్టుకోగల శక్తిమంతమైన కట్టడాలు భవిష్యత్తులో రాబోతున్నాయని, దానికి జియోటెక్నికల్ అధ్యయనాలే పునాది కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంధన రంగంలో హైడ్రోజన్, సోలార్ వంటి ప్రత్యామ్నాయాలు వస్తున్నట్లే, నిర్మాణ రంగంలో కూడా విపత్తులను తట్టుకునే సరికొత్త డిజైన్లు రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంజినీర్ తన వృత్తిపరమైన బాధ్యతగా నేల పరీక్షను తప్పనిసరి అంశంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు.








