Mahaa Daily Exclusive

  పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు గదిలో విగతజీవిగా..! లొకేష్ ఆత్మహత్య వెనుక మిస్టరీ?

Share

  • వివాహానికి ముందు ఘోరం!
  •  నిన్న పెళ్లి బట్టలు.. నేడు శవమై..:
  •  లొకేష్ ఆత్మహత్య వెనుక మిస్టరీ?

కేపీహెచ్‌బీ కాలనీ, మహా.

వివాహబంధంతో ఒక్కటవ్వాల్సిన ఆ జంట జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు, పెళ్లి బట్టలు ధరించి ఉరివేసుకున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ప్రేమించిన యువతికి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి, తీరా సమయం దగ్గర పడేసరికి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసులు మరియు బాధితురాలి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చేర్లోపల్లికి చెందిన వనమల లొకేష్ (29) నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతితో అతడికి రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం గుడిలో లేదా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామని లొకేష్ ఆ యువతికి చెప్పాడు. ఇందుకు సంబంధించి ఇరువురు కలిసి పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్టలో ఉన్న ఒక ఓయో గదిని లొకేష్ తీసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో తాను పెళ్లి బట్టలు ధరించి సిద్ధంగా ఉన్నానని, తనకు భోజనం తీసుకురావాలని ఆ యువతికి కబురు పంపాడు. లొకేష్ చెప్పినట్లుగానే ఆమె భోజనం తీసుకుని గది వద్దకు వెళ్లి తలుపు తట్టింది. ఎంతసేపటికీ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన చెందిన యువతి, తన స్నేహితులకు ఫోన్ చేసింది. వారు అక్కడికి చేరుకుని ఓయో సిబ్బంది సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా, లొకేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు.
పెళ్లి బట్టలు ధరించి వరుడి వేషంలో ఉన్న లొకేష్‌ను చూసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని, కొత్త బట్టలు ధరించిన తర్వాత లొకేష్ ఎందుకు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.